Ys Jagan : జగన్ ప్రమాదకారి...భ్రమల్లో ఉంటే బాక్సులు గల్లంతేనట
వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజకీయ అనుభవం తక్కువయినప్పటికీ ఆయన ఆలోచనలు మాత్రం ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజకీయ అనుభవం తక్కువయినప్పటికీ ఆయన ఆలోచనలు మాత్రం ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో చంద్రబాబుకు రాజకీయంగా ఇలాంటి సవాళ్లు ఎప్పుడూ ఎదురుకాలేదు. గతంలో కాంగ్రెస్ తో ఆయన ఢీకొట్టేవారు. కాంగ్రెస్ ను ఎదుర్కొనడం పెద్దపని కాదు. అది ఢిల్లీ హైకమాండ్ సూచనల మేరకు నడుస్తుంటుంది. కానీ జగన్ పార్టీ అలా కాదు. బలమైనది. ఇప్పటికీ రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకు ఉంది. నలభై శాతం ఓటు బ్యాంకు ఉన్న వైసీపీని చంద్రబాబు తక్కువగా వేయరు కూడా. పైకి జగన్ పై విమర్శలు చేస్తున్నప్పటికీ జగన్ ఏ దారిలో వస్తారన్నది ఆయనకు అంతుచిక్కకుండా ఉంది.
మావిగన్ ప్రతిపాదనతో...
అమరావతి రాజధాని నిర్మాణానికి చట్టబద్ధతపై పార్లమెంటులో చర్చ జరుగుతున్న సమయంలోనే జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ రాజధాని నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. జగన్ మావిగాన్ ప్రతిపాదన జోక్ గా అనుకున్న వారంతా రాను రాను సీరియస్ గా ఆలోచన చేయడం ప్రారంభించారు. అంతెందుకు.. చంద్రబాబు సయితం మూడు ప్రాంతాల అభివృద్ధి.. అంటూ విశాఖపట్నం, తిరుపతి, అమరావతిని నెంబర్ వన్ సిటీలుగా చేస్తామని ఇటీవల ప్రకటించడం జగన్ మావిగాన్ ఎఫెక్ట్ అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనను చంద్రబాబు అంత సులువుగా తీసుకోలేదని దీన్ని బట్టి అర్ధమవుతుంది.
అధికారంలో ఉన్న వారిపై...
ఎవరెన్ని అనుకున్నా వచ్చే ఎన్నికల నాటికి కూటమి ప్రభుత్వంపై ఎంతో కొంత వ్యతిరేకత ఏర్పడటం ఖాయం. ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేసినా.. అభివృద్ధి చేసి చూపెట్టినా ప్రజలు మార్పు కోరుకుంటారు. చంద్రబాబు భయం అదే. అధికారంలో ఉన్న వాళ్లు ఎవరైనా తమదే మళ్లీ పవర్ అని భ్రమపడతారు.కానీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నచంద్రబాబు ఆ భ్రమల్లో ఎప్పుడూ ఉండరు. అందుకే జగన్ విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తుంటారు. జగన్ రేపు జనంలోకి వెళితే పార్టీకి ఇంకా హైప్ వస్తుంది. మరొకవైపు కూటమి పార్టీల మధ్య నియోజకవర్గాల్లో సఖ్యత లేదన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఇవన్నీ పరిశీలించినప్పుడు జగన్ ను చంద్రబాబు అంత తేలిగ్గా తీసుకోరన్నది వాస్తవం. జగన్ కూడా ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.