Pawan Kalyan : మీరు లైట్ తీసుకుంటే.. వారు కూడా లైట్ తీసుకుంటారు సామీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారశైలి ఆ పార్టీ నేతలకు, క్యాడర్ కు కూడా అంతు చిక్కడం లేదు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారశైలి ఆ పార్టీ నేతలకు, క్యాడర్ కు కూడా అంతు చిక్కడం లేదు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టింది ఎందుకోసం? అన్న ప్రశ్న ఆ పార్టీ నేతలే సోషల్ మీడియాలో సంధిస్తున్నారు. ఒక పార్టీ పెట్టినప్పుడు అధికారంలోకి రావాలని ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు కాకపోతే.. మరొకసారి అధికారంలోకి వస్తామన్న ఆశలు కూడా పార్టీ కార్యకర్తల్లో ఉంటుంది. అందులోనూ ఆంధ్రప్రదేశ్ అనేది కుల రాజకీయాలకు ప్రసిద్ధి. కాపు సామాజికవర్గం ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వారిని తన పార్టీ నుంచి బయటకు పోకుండా చూసుకోవాల్సిన పవన్ కల్యాణ్ మాత్రం ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదంటున్నారు.
నేతలు ఇబ్బందులు పడుతున్నా...
జనసేన నేతలు నియోజకవర్గాల్లో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోరన్న విమర్శలను పవన్ కల్యాణ్ సొంత పార్టీ నేతల నుంచే ఎదుర్కొంటున్నారు. అదే జగన్ పార్టీపై ఒంటికాలుపై లేస్తారని, చంద్రబాబుకు ఏ మాత్రం కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తారని, కానీ జెండా పట్టుకుని, జేబులు ఖాళీ చేసుకున్న నేతలను మాత్రం దూరం పెడుతుండటంతో పవన్ కల్యాణ్ అసలు ఎవరికీ అర్థం కాని నేతగా మారిపోయారంటున్నారు. ఇప్పటికే అనేక మంది నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వారంతా కాపు సామాజికవర్గం నేతలే. వారు 2014 నుంచి జనసేన జెండా పట్టుకుని తిరిగిన వారే. వారిని ఆదుకోకుండా చివరి నిమిషంలో తానున్నానని చెప్పినా ఎవరూ నమ్మని పరిస్థితిని పవన్ ఎదుర్కొనే అవకాశాలున్నాయంటున్నారు.
పార్టీ కార్యకర్తలకు అండగా...
కనీసం పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాల్సిన సమయంలో పవన్ దూరం పాటించడం ఇప్పుడు గ్లాసు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన కార్యకర్త ఇల్లు కూలగొట్టిన సందర్భంలోనూ పవన్ స్పందించలేదు. అలాగే నూజివీడు వ్యవహారంలోనూ పార్టీ నేతలను సస్పెండ్ చేయడం, జనసేన నేతలు, కార్యకర్తలు నియోజకవర్గాల్లో ఇబ్బందులు పడుతున్నప్పటికీ పట్టించుకోకపోవడం ఇవన్నీ పవన్ కల్యాణ్ కు మైనస్ గా మారే అవకాశాలున్నాయన్న అంచనాలు ఆ పార్టీ నుంచే వినపడుతున్నాయి. జనసైనికులే సోషల్ మీడియాలో పార్టీ అధినేతకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతుండటాన్ని లైట్ గా తీసుకుంటున్న జనసేనాని, వచ్చే ఎన్నికల్లో తాను నమ్ముకున్న ఓటర్లు కూడా లైట్ తీసుకుంటారన్న విషయాన్ని విస్మరించకూడదని అంటున్నారు.