గడపగడపకు వెళ్లండి.. పార్టీ శ్రేణులకు సీఎం కీలక సూచనలు

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వైసీపీ ప్రభుత్వం హయంలో జరిగిన..

Update: 2023-10-11 03:36 GMT

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వైసీపీ ప్రభుత్వం హయంలో జరిగిన అభివృద్ధి పనులను జనాల్లోకి తీసుకెళ్లేందుకు రెడీ అయ్యింది. ప్రభుత్వం చేసిన మంచి పనులను క్షేత్రస్థాయికి వెళ్లి మరీ తెలియజెప్పాలని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ పార్టీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లతో భేటీ అయిన ఆయన పలు సూచనలు, సలహాలు చేశారు. వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమాల్లో భాగంగా.. ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయ యాత్ర పేరుతో బస్సు యాత్రలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. దసరా పండుగ ముగించుకుని ఈ నెల 26వ తేదీ నుంచి బస్సు యాత్రలు మొదలుపెట్టాలని, ప్రతీ నియోజకవర్గంలోనూ సమావేశాలు జరగాలని సూచించారు. మూడు ప్రాంతాల నుంచి ఒక్కో మీటింగ్‌చొప్పున.. ప్రతిరోజూ మూడు మీటింగ్‌లు నిర్వహించాలి. ఇది అత్యంత ముఖ్యమైన కార్యక్రమం. దీన్ని విజయవంతం చేయాలంటూ పార్టీ శ్రేణులను జగన్‌ ఆదేశించారు.

రెండు నెలలపాటు..

వచ్చే రెండు నెలలపాటు బస్సు యాత్రలు నిర్వహించాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా సమావేశాల తేదీ, స్థలం.. ఇలా పక్కా ప్రణాళిక తయారు చేసుకోవాలని, బస్సు యాత్ర సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే, పార్టీ ఇంఛార్జితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులు మాట్లాడాలి. 52 నెలల పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాలకు చేసిన మేలును ఈ సమావేశాల ద్వారా వివరించి ఆయా వర్గాలకు మరింత చేరువ కావాలన్నారు. సమావేశాలకు ప్రజలు, సచివాలయ కన్వీనర్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, వాలంటీర్లు హాజరయ్యేలా చూడాలని సీఎం జగన్‌ పార్టీ శ్రేణులకు సూచించారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను రీజినల్ కో-ఆర్డినేటర్లు సందర్శించాలని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమం సమర్థవంతంగా జరిగేలా కృషి చేయాలని జగన్ సూచించారు.

Tags:    

Similar News