Ys Jagan : నాడి తెలిసిన తర్వాతనే జగన్ అమరావతిపై అలా మాట్లాడారటగా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజధాని అమరావతి విషయంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజధాని అమరావతి విషయంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి. అయితే జగన్ మాట తూలలేదంటున్నారు. అలాగే తాను రాయలసీమ ఎత్తిపోతల పథకంపై గంటల సేపు మాట్లాడి చివరలో అమరావతి రాజధాని పై చేసిన వ్యాఖ్యలు హైలెట్ అవుతాయని ఆయనకు తెలియని కాదు. కావాలనే జగన్ ఈ వ్యాఖ్యలను చేసినట్లు కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల తర్వాత రాజధాని అమరావతిపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను చూసిన తర్వాత మాత్రమే జగన్ అమరావతిపై ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటున్నారు. రాజధాని అమరావతి నది పక్కన నిర్మించడం సరైనది కాదని ఆయన చేసిన వ్యాఖ్యలు కొందరు తప్పుపట్టినా రాజకీయంగా కొంత కలిసి వచ్చే అవకాశాలున్నాయన్న అంచనాతోనే అలా అన్నారని తెలిసింది.
అనకూలత లేదని...
రాజధాని అమరావతి విషయంలో గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వారిలో కొందరికి మాత్రమే సానుకూలత ఉందన్న అభిప్రాయం జగన్ చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత రాజధాని అమరావతిలో దాదాపు అరవై కోట్ల రూపాయలు వ్యయం చేయడంతో పాటు అవి కూడా అప్పులు తెచ్చి చేయడాన్ని మిగిలిన ప్రాంతం నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. హైదరాబాద్ వంటి నగరం తమకు కావాలని అందరిలో ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు అన్ని వేల కోట్ల ఖర్చు చేయడం సరికాదన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపించడమే జగన్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడానికి కారణమని అంటున్నారు. మరొకవైపు నీళ్లు తోడటానికి, పిచ్చి చెట్లు కొట్టడానికే వందల కోట్లు ఖర్చు చేయడాన్ని కూడా ఇతర ప్రాంత ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న భావనలో జగన్ ఉన్నారు.
లక్షల కోట్లు వ్యయం చేసి...
మరొకవైపు రాజధాని అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహానికి 1750 కోట్ల రూపాయలు వ్యయం చేయడం, రెండో విడత భూ సమీకరణకు దిగడం కూడా ప్రభుత్వ వైఖరికి కారణమని తెలుస్తోంది. రాజధాని అమరావతిలో భూములు సంస్థలకు ఎక్కువగా కేటాయించకుండా విశాఖపట్నంలోని భూములను కారు చౌకగా కట్టబెట్టడాన్ని కూడా ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు కొంత పెదవి విరుస్తున్నారు. అలాగే ఎకరం నాలుగు కోట్ల రూపాయలు కూడా పలకని అమరావతి భూములను అలాగే ఉంచి యాభై నుంచి వంద కోట్ల రూపాయల విలువ చేసే భూములను కారు చౌకగా ఇచ్చేయడాన్ని కూడా వారు తప్పుపడుతున్నారు. దీంతో పాటు రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం ఏర్పడి దాదాపు పదేళ్లవుతుంది.
రెండో విడత సేకరణ...
తొలి విడత సేకరించిన యాభై వేల ఎకరాలకు తోడు, ఇప్పుడు అదనంగా మరో ఇరవై వేల ఎకరాలను సేకరించడంతో ఆ ప్రాంత వాసులు కూడా కొంత అసంతృప్తితో ఉన్నారని నేతల నుంచి సమాచారం అందడడంతోనే ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు. గుంటూరు, విజయవాడ ప్రాంతాల అభివృద్ధిని విస్మరించడం కూడా ఆ ప్రాంత ప్రజలు కూడా అసంతృప్తితో ఉన్నారని తెలిసి జగన్ అమరావతిపై ఇలా మాట్లాడరంటున్నారు. అమరావతి దానంతట అభివృద్ధి అయ్యేలా చూడాలి కానీ, లక్షల కోట్లు తగలేయడమేంటన్న ప్రశ్న మేధావి వర్గాల నుంచి కూడా వినపడుతుంది. వరద నీటిని ఎత్తిపోయడానికి వెయ్యి కోట్ల ఖర్చు చేయాలనకోవడం వంటి అంశాలు జగన్ మిగిలిన ప్రాంతాల ప్రజల నాడిని పసిగట్టి అన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందరూ అనుకున్నట్లుగా జగన్ రాజకీయ ప్రయోజనాల కోసమే అమరావతిపై ఈ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ నేతలు అంటున్నారు.