Boppudi : ఎక్స్ పెక్టేషన్ కు తగ్గట్లు మోదీ విమర్శలు లేవే.. జగన్ ను అలా వదిలేశారేంటి?

జగన్ పై నేరుగా మోదీ విమర్శలు చేయకపోవడమే అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

Update: 2024-03-17 13:52 GMT

చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో జరిగిన బహిరంగ సభను చూసిన వారికి ఒక సందేహం మాత్రం రాక మానదు. జగన్ పై నేరుగా మోదీ విమర్శలు చేయకపోవడమే అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏదో అనాలని అన్నారే కాని.. జగన్, కాంగ్రెస్ ఒక్కటేనంటూ ఒక కామెంట్ తో సరిపెట్టారు. కానీ టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు మోదీ నుంచి ఎక్స్ పెక్టేషన్ మామూలుగా లేదు. మోదీ జగన్ ను తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తారని భావించారు. జగన్ అవినీతి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారనుకున్నారు. అందుకే అంత భారీ స్థాయిలో జనసమీకరణ జరిపి మోదీ చేత జగన్ పై విమర్శలు చేస్తే విందామని అనుకున్నారు.

తెలంగాణలో మాత్రం...
కానీ టీడీపీ నేతలు ఎక్స్ పెక్టేషన్ కు తగ్గట్లు మోదీ కామెంట్స్ లేవు. మోదీ ప్రసంగం అంతా ఎన్డీఏను దేశంలో గెలిపించాలని, నాలుగు వందల సీట్లు రావాలంటూ పదే పదే ఆయన కోరారు తప్పించి జగన్ ను గద్దె దించాలన్న పిలుపును నేరుగా ఇవ్వలేదని టీడీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. నిజానికి మోదీ ఇతర రాష్ట్రాలకు వెళితే అక్కడి పార్టీలపై విమర్శల స్థాయి మామూలుగా ఉండదు. పొరుగున ఉన్న తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పై అవినీతి విమర్శలు చేస్తూ పేర్లు చెప్పి మరీ అక్కడి నేతలను విమర్శించారు. కానీ ఏపీకి వచ్చేసరికి ఆయన టోన్ లో తేడా కొడుతోంది. జగన్ ను ప్రత్యక్షంగా విమర్శించకుండా చిక్కీ చిక్కనట్లు అనేసి వెళ్లిపోయారు.
మంత్రులు అవినీతికి...
మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని, కాంగ్రెస్, జగన్ వేర్వేరు అయినా ఒకే కుటుంబ సభ్యులు దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని అని మాత్రమే అన్నారు. అంతే తప్ప జగన్ పై ప్రత్యక్ష విమర్శలు చేయలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని అన్నారు తప్పించి.. నేరుగా జగన్ ను ఓడించమని చెప్పకపోవడం ఏంటి భయ్యా? అంటూ తమ్ముళ్లు తెగ తపన పడి పోతున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కోరారు తప్పించి.. ఇక్కడ టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించమని నేరుగా కోరలేదు. అదే సమయంలో ఎన్డీఏ ఎంపీ అభ్యర్థులను మాత్రం గెలిపించాలని కోరటం కూడా ఇప్పుడు జనసేన, టీడీపీలో చర్చనీయాంశమయింది.
గత ఎన్నికల ప్రచారంలో...
గత ఎన్నికల్లో ఏపీకి ప్రచారానికి వచ్చినప్పుడు కుటుంబ పార్టీ అని, పోలవరాన్ని ఏటీఎంగా చంద్రబాబు వాడుకున్నారని పదే పదే విమర్శించి వెళ్లారు. కానీ ఈసారి మాత్రం పోలవరం ప్రస్తావన లేదు. కేవలం అభివృద్ధి లేదంటూ పాసింగ్ రిమార్క్ ఒకటి ఇచ్చి వెళ్లిపోవడం జగన్ ను దూరం చేసుకోవడం ఇష్టం లేకనేనా? అన్న చర్చ కూడా మొదలయింది. రాజ్యసభలో అత్యథిక స్థానాలున్న వైసీపీపై ఎక్కువ విమర్శలు చేయలేకపోవడం వెనక ఒక కారణమని టీడీపీ ముఖ్య నేత ఒకరు అభిప్రాయపడ్డారు. మొత్తం మీద మోదీ నోటి నుంచి జగన్ పై సూటిగా విమర్శలు చేయకపోవడం టీడీపీ శ్రేణుల్లో నిరుత్సాహాన్ని నింపిందనే చెప్పాలి.


Tags:    

Similar News