YSRCP : జాబితాలో తర్వాత పేరు అనిల్ దేనట...ఇక అరెస్ట్ కు అంతా సిద్ధమయినట్లేనా?
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చుట్టూ కూడా ఉచ్చు బిగుసుకుంటున్నట్లే కనపడుతుంది
వైసీపీ నేత,అనిల్ కుమార్‌యాదవ్ జాబితాలో తర్వాత నెంబరు ఉందా? అంటే అవుననే అనిపిస్తుంది. ఇప్పటికే వైసీపీ నేతలు వరస బెట్టి అరెస్ట్ అవుతున్నారు. ప్రధానంగా నెల్లూరు జిల్లాకు చెందిన నేతలు కూడా ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. కాకాణి గోవర్థన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చుట్టూ కూడా ఉచ్చు బిగుసుకుంటున్నట్లే కనపడుతుంది. ఆయనపై కూడా త్వరలో కేసు నమోదయ్యే అవకాశాలున్నాయి. తర్వాత అరెస్ట్ అనిల్ కుమార్ యాదవ్ అంటూ పెద్దయెత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే అనిల్ కుమార్ యాదవ్ కు సంబంధించిన కేసుకు అంతా సిద్ధం చేసినట్లు సమాచారం.
క్వార్జ్ అక్రమ రవాణా కేసులో...
నెల్లూరు క్వార్జ్ అక్రమ రవాణా కేసులో అనిల్‌కుమార్ యాదవ్ పై త్వరలో కేసు నమోదయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ కేసులో అనిల్ కుమార్ యాదవ్ ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని హైదరాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్వార్జ్ మైనింగ్ స్కామ్‌లో అనిల్‌కుమార్ యాదవ్ పాత్రపై వివరాలను శ్రీకాంత్ రెడ్డి వెల్లడించినట్లు సమాచారం. అనిల్ కుమార్ రెడ్డితో పాటు కాకాణి గోవర్థన్ రెడ్డితోనూ తనకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని శ్రీకాంత్ రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. 2023 ఆగస్టు నుంచి అనిల్ కుమార్ యాదవ్, కాకాణి గోవర్థన్ రెడ్డితో తాను క్వార్జ్ వ్యాపారం చేశానని శ్రీకాంత్ రెడ్డి చెప్పడంతో ఈ ఇద్దరిపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రధాన అనుచరుడు ఇచ్చిన సమాచారంతో...
లీజు గడువు ముగిసిన రుస్తుం మైన్ నుంచి క్వార్జ్ తీశామని శ్రీకాంత్ రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి క్వారీ పనులు చూసుకున్నారని, పర్యవేక్షించినందుకు తనకు టన్నుకు వెయ్యి రూపాయలు ఇచ్చేవారని కూడా శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు తెలిపినట్లు సమాచారం. రు.. క్వార్జ్‌ను ఏనుగు శశిధర్‌రెడ్డి పొలంలో డంప్ చేసేవాళ్లమని, శశిధర్‌రెడ్డికి ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం కుదరిందని తెలిపార. రుస్తుం మైన్ నుంచి తీసిన క్వార్జ్‌ను చైనా పంపించామని కూడా శ్రీకాంత్‌రెడ్డి పోలీసుల విచారణలో అంగీకరించారు. దీంతో అనిల్ కుమార్ యాదవ్ పై త్వరలోనే కేసు నమోదు చేసే అవకాశముందని తెలిసింది.