Ys Jagan : పదవి కోసమే పట్టుబడుతూ ప్రజాసమస్యలను గాలికి వదిలేస్తున్నారా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటికైనా పదవుల కోసం పాకులాడుకుండా ప్రజాసమస్యలను పట్టించుకోవడం మేలు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటికైనా పదవుల కోసం పాకులాడుకుండా ప్రజాసమస్యలను పట్టించుకోవడం మేలు. కేవలం ప్రతిపక్ష హోదా కోసం పట్టుపట్టకుండా జనం బాట పడితే మేలంటున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇప్పుడు అసెంబ్లీకి పోనంటున్నారు. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప రానుంటున్నారు. ఎవరి మీద అలక? జనం మీదనా? లేక ప్రతిపక్ష హోదా ఇవ్వని అధికార పార్టీ మీదనా? అన్నది ప్రజలు ఆలోచించుకునే అవకాశముంది. ఎన్నికలు ముగిసి ఏడాదవుతుంది. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే తాను అసెంబ్లీకి రానంటూ జగన్ మొండి కేసి కూర్చుకున్నారు.
అలా అయితే తప్ప వెళ్లరా?
అనర్హత వేటు పడుతుందని ఒక రోజు వెళ్లి రావడం మిగిలిన రోజుల్లో సభకు డుమ్మా కొట్టడం జగన్ కు అలవాటుగా మారింది. అయితే ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప సభకు వెళ్లరా? లేకపోతే ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప సమావేశాల్లో పాల్గొనరా? ప్రజా సమస్యల కంటే పదవులపైనే జగన్ ఎక్కువ మక్కువ చూపుతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో కలిగేందుకు ఎక్కువ అవకాశముంది. ప్రతిపక్ష హోదా ఉంటే అసెంబ్లీలో ఎక్కువ సమయం మాట్లాడే అవకాశం ఇస్తారన్నది జగన్ వాదన. అలా మాట్లాడకుండా అధికార పార్టీ జగన్ ను అడ్డుకుంటే అది ఆయనకే సానుభూతి కలుగుతుంది. మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వకపోతే అప్పుడే వాకౌట్ చేసి బయటకు వచ్చి మీడియా సమావేశం పెట్టొచ్చు.
చిన్నపిల్లాడిలా...
కానీ జగన్ అలా చేయడం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే తాను రానుంటూ చిన్నపిల్లాడు మంకు పట్టునట్లు వ్యవహరిస్తుండటం కూడా చూసే వారికి ఇబ్బందికరంగా ఉంది. సభలో ఏదైనా అవమానం జరిగితే సభ నుంచి శపథం చేసి బయటకు రావచ్చు. కానీ పదవి ఇవ్వడం లేదంటూ తాను పోనంటూ మొరాయించడం జగన్ ఆలోచన ఎటు వెళుతుందన్నదానికి మాత్రం వైసీపీ నేతలకే అర్థం కావడం లేదు. తాను వెళ్లకుండా, తన పార్టీ గుర్తు మీద గెలిచిన మిగిలిన పది మంది ఎమ్మెల్యేలకు కూడా జగన్ ఇదే సూత్రాన్ని అమలు చేస్తున్నారు. తాను చెడింది కాకుండా.. తన తోటి ఎమ్మెల్యేలను కూడా సభకు వెళ్లకుండా నిలువరించడం ఎందుకన్న ప్రశ్న వినపడుతుంది. వాళ్లు ఇవ్వమంటున్నా.. ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు.
జనంలోకి వెళ్లాల్సిన...
ఇక వైఎస్ జగన్ జనంలోకి వెళ్లాల్సిన సమయంలో ఇటు బెంగళూరు టు అమరావతి చక్కర్లు కొడుతూ కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వినపడుతున్నాయి. ఇక్కడ కూర్చుని అధికార పార్టీపై విమర్శలు చేసే కన్నా జనంలోకి వెళ్లి తేల్చుకుంటే అది ప్లస్ గా మారుతుందని సూచిస్తున్నారు. కానీ జగన్ మాత్రం సంక్రాంతి నుంచి జిల్లాల పర్యటనలు వాయిదా వేసుకంటూ వస్తున్నారు. ఇప్పుడు ఉగాది అంటున్నారు. ఉగాది నాటికి కూడా జనంలోకి రావడం డౌట్ గానే ఉంది. ఎందుకంటే ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఇంత ముందు జనంలోకి వెళ్లడం వృధా ప్రయాస అని జగన్ భావిస్తున్నట్లుంది. కానీ ఈలోపు క్యాడర్ తో పాటు నేతలు కూడా చేజారిపోయే అవకాశముందన్న హెచ్చరికలు జగన్ చెవికి సోకడం లేదు.