BJP : కమలం.. ఇక రాష్ట్రంలో కాషాయం ధరించాల్సినట్లేనా?

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది కావస్తుంది. బీజేపీ ఖాతాలో విజయాలు పడటం లేదు

Update: 2025-05-14 07:31 GMT

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది కావస్తుంది. ఈ ఏడాది కాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేయడంపై చంద్రబాబు దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. 164 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చాయి. అయితే ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖాతాలోనే పడుతుంది. అమరావతి రాజధాని విషయంలోనూ, పోలవరం విషయంలోనూ ఏ కంపెనీ వచ్చినా సరే అది టీడీపీ ఖాతాలోనే పడుతుంది. అది సహజం కూడా. ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వల్లనే తీసుకున్న నిర్ణయాల ఫలితాలు ఆయన ఉన్న పార్టీకే చెందుతాయి.

జనసేన కూడా...
ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలోనూ పరవాలేదు. ఎందుకంటే పవన్ కల్యాణ్ తనకు అప్పగించిన శాఖతో పాటు ఇమేజ్ ఉన్న నేత కావడంతో పవన్ కల్యాణ్ కు కూడా సహజంగానే మంచి మార్కులు పడతాయి. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు. చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కల్యాణ్ కు కూడా అదే స్థాయిలో మంచి ప్రాధాన్యత అందరూ ఇస్తున్నారు. ఇటీవల జమ్మూకాశ్మీర్ లో మరణించిన వీర జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలకు హాజరైన పవన్ కల్యాణ్ ప్రభుత్వం తరుపున ఐదు ఎకరాలు, యాభై లక్షలు ప్రకటించడంతో పాటు తాను వ్యక్తిగతంగా ఇరవై ఐదు లక్షలు ప్రకటించారు. అలాగే పహాల్గామ్ దాడిలో మరణించిన ఒకరికి పార్టీ తరుపున యాభై లక్షల విరాళాన్ని ప్రకటించి అందరి మన్ననలను అందుకున్నారు. ఇలా మంచి పనులు, తీసుకున్న నిర్ణయాలు కూడా ఆటోమేటిక్ గా పవన్ ఖాతాలో పడిపోతున్నాయి.
ఏ ప్రయోజనం లేకుండా...
కానీ కూటమిలోని ఏ ప్రయోజనం లేకుండా ఉన్నది బీజేపీ మాత్రమేనని అందరూ అంగీకరించాల్సిందే. ఎందుకంటే బీజేపీలో ఇమేజ్ ఉన్న నేత లేకపోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా రాష్ట్రానికి సహాకారం అందిస్తున్నప్పటికీ దానికి విస్తృత ప్రచారాన్ని ఆ పార్టీ చేసుకోలేకపోతుంది. అందుకే నామినేటెడ్ పోస్టుల్లోనూ పెద్దగా ఆ పార్టీకి అవకాశాలు దక్కడం లేదు. అందుకే క్యాడర్ లోనూ, నేతల్లోనూ నిరాశ, నిస్పృహలు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు ఏ క్రెడిట్ వచ్చినా టీడీపీ, జనసేనకు మాత్రమే వెళతాయి తప్పించి ప్రత్యేకంగా బీజేపీకి దక్కవు. అందుకే గత కొన్నేళ్లుగా ఏపీలో బీజేపీ ఎదగలేదన్న పరిస్థితి ఈ ఐదేళ్లు అలాగే కొనసాగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. నాయకులున్నప్పటికీ ఆ పార్టీకి క్రెడిట్ దక్కాలన్న ప్రయత్నం వారిలో లోపించడం కూడా ఒకకారణమని చెప్పకతప్పదు. అందుకే రాజకీయ సన్యాసం స్వీకరించినట్లు కమలం పార్టీ కాషాయం ధరించినట్లే కనపడుతుంది.
Tags:    

Similar News