Etala Rajender : ఈటల బయటపడేందుకు ముహూర్తం చూసుకుంటున్నారా?

ఈటల రాజేందర్ బీజేపీ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది

Update: 2025-06-19 12:25 GMT

ఈటల రాజేందర్ బీజేపీ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆయన అందులో ఇమడలేకపోతున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఇప్పుడే ఆ పనిచేయకపోవచ్చు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈటల రాజేందర్ బీజేపీ నుంచి బయటపడే ఛాన్స్ ఉందని అంటున్నారు. నిజానికి బీజేపీ సిద్ధాంతాలకు ఈటల ఆలోచనలకు అసలు పొంతన లేదు. ఈటల రాజేందర్ మావోయిస్టు ఉద్యమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర మంత్రి కాగలిగారు. బీఆర్ఎస్ లో ఉద్యమకాలం నుంచి పనిచేసి కేసీఆర్ కు చేదోడు వాదోడుగా నిలిచారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించక ముందు కూడా కేసీఆర్ ఈటల రాజేందర్ కు ప్రయారిటీ ఇచ్చారు. శాసనసభలో పార్టీ నేతగా అవకాశం కల్పించారు.

బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి...
తర్వాత కేసీఆర్ వైఖరి వల్లనో, తనకు మంత్రి పదవి ఇచ్చినా తన మాటలు చెల్లుబాటు కావడం లేదన్న అక్కసుతోనే ఈటల రాజేందర్ గులాబీ పార్టీని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. కేసీఆర్ కు కాలేలా మాటలు మాట్టాడటంతో కేబినెట్ నుంచి బయటకు పంపారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరాలనుకున్నప్పటికీ అక్కడ తనకు రక్షణ లేదని భావించి ఈటల రాజేందర్ బీజేపీలో అనివార్యంగా చేరాల్సి వచ్చింది. బీజేపీ కేంద్రంలో ఉండటం, తనపై భూముల ఆక్రమణల కేసులు నమోదు కావడంతో ఊపిరి సలపని పరిస్థితుల్లో కమలం పార్టీలో సేద తీరేందుకు సిద్ధమయ్యారు. బీజేపీలో రాను రాను తన పరిస్థితి ఏంటో తెలిసిపోయింది. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కేంద్రంలో అధికారంలోకి వచ్చినా తనకు మంత్రి పదవి సీనియర్ నేతలను దాటి తనకు అందే అవకాశాలు అంతంత మాత్రమేనన్న అంచనాకు వచ్చారు.
పరోక్ష సంకేతాలు...
అందుకే ఆయన తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారంటున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిచినప్పుడు కూడా ఈటల రాజేందర్ అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారంటున్నారు. అంతటితో ఆగకుండా తనతో బీఆర్ఎస్ నేతలకు మంచి సంబంధాలున్నాయన్నఈటల, కేసీఆర్ మినహా తనతో అందరూ మాట్లాడుతున్నారని ఒక ఛానెల్ ఇంటర్వ్యూలో చెబుతూ బీజేపీకి సిగ్నల్స్ పరోక్షంగా పంపినట్లయిందని అంటున్నారు. తనకు ప్రాధాన్యత దక్కకుంటే పార్టీ వీడతానని కూడా చెప్పకనే ఆయనచెప్పినట్లు స్పష్టమవుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా తనకు రానివ్వకుండా కొందరు అడ్డంపడ్డారని అందుకే బీజేపీలో ఉండి కేవలం పార్లమెంటు సభ్యుడిగానే మిగిలి పోవాల్సి ఉంటుందని ఆయన ఒక అభిప్రాయానికి వచ్చినట్లుచెబుతున్నారు.
ఎంపీగా ఉన్నా...
2024లో జరిగినలోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో తన వల్లనే ఎనిమిది పార్లమెంటు స్థానాలు తెలంగాణలో బీజేపీకి వచ్చాయన్న నమ్మకంతో ఉన్న ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి పదవిపై ఆశలు పెంచుకున్నారు. కానీ మోదీ ఈటల వైపు చూడలేదు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు కేంద్ర మంత్రి పదవి వరించింది. బీజేపీలో ఉంటే తన రాజకీయ ఎదుగుదల ఉండదని భావిస్తున్న ఈటల రాజేందర్ ఎంపీగా ఉన్నప్పటికీ ఢిల్లీలో కూడా తాను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నట్లు అర్థమయింది. బీజేపీలో కొనసాగితే తనకు భవిష్యత్ లోనూ పదవియోగం లభించదని భావించి ఆయన బీజేపీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. ఈటల రాకను బీఆర్ఎస్ నేతలు కూడా కోరుకుంటుండటంతో ఆయన చేరిక ఎంతో దూరం లేదంటున్నారు.



Tags:    

Similar News