Rain Alert : ఐదు రోజులు భారీ వర్షాలు.. రెండు వర్షాల్లో తప్పవు తిప్పలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు హై అలెర్ట్ ను భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు హై అలెర్ట్ ను భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.కుండ పోత వర్షం కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను రక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపింది. దీంతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఏపీకి భారత వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. అవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిదని, ప్రయాణాలను మానుకోవాలని కూడా అధికారులు తెలిపారు. ఇప్పటికే కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి.
ఏపీకి ఎల్లో అలెర్ట్...
ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. అలాగే తిరుపతి, కడప, అన్నమయ్య, కడప, నంద్యాల జిల్లాలకు కూడా వర్ష సూచన చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని చెప్పింది. ఈనెల 13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని చెప్పింది. ఉత్తర అంతర కర్ణాటక మరియు దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 & 5.8 కి.మీ మధ్య ఎత్తులో విస్తరించి కొనసాగుతున్నదని తెలిపింది.
తెలంగాణలో వారం రోజులు...
ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోన్న ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వారం రోజుల పాటు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్,కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలపింది. గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలపింది. దీంతో పాటు కృష్నా, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఈ నెల 17వ తేదీ వరకూ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది.