Bus Accident : వణికిపోతున్న బస్సు ప్రమాద బాధితులు.. ఇలా బయటపడ్డామని
కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నవేమూరి కావేరి బస్సు అగ్నిప్రమాదంలో 20 మంది మృతి చెందారు
కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నవేమూరి కావేరి బస్సు అగ్నిప్రమాదంలో 20 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బతికినవారు ఆ దుర్ఘటన క్షణాలను గుర్తు చేసుకుంటూ వణికిపోతున్నారు. ఘటన జరిగిన సమయాన్ని గుర్తు చేసుకుంటూ వారు ఇంకా తేరుకోలేకపోతున్నారు. జరిగిన ఘటన తలచుకుని వణికిపోతున్నారు. తమకు పునర్జన్మ లభించిందని అంటున్నారు. తాము బతికి బయటకు వస్తామని అనుకోలేదని చాలా మంది వణుకుతూ చెబుతున్నారు.
మెలుకువ వచ్చి చూడగా...
బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు జయంత్ కుశ్వాహా మాట్లాడుతూ, ‘‘రాత్రి రెండున్నర, మూడింట మధ్య మెలుకువ వచ్చింది. బస్సు లోపల మంటలు చెలరేగుతున్నాయి. మొదట అది అగ్నికీలకమని నమ్మలేకపోయాం. ఇద్దరు, ముగ్గురే మేల్కొన్నారు. మిగతావారిని మేల్కొలిపేందుకు కేకలు వేశాం. తలుపులు లాక్ అయ్యి ఉన్నాయి. డ్రైవర్లు కనిపించలేదు. ఆపదలో ఎమర్జెన్సీ కిటికీ పగలగొట్టి బయటకు దూకాం. మరికొందరు కిటికీలు పగలగొట్టి బయటపడ్డారు,’’ అని వివరించారు.
కిటికీ అద్దాలు పగలకొట్టుకుని...
మరొక బాధితుడు అశ్విన్ మాట్లాడుతూ, ‘‘నేను డ్రైవర్ వెనుక సీట్లో ఉన్నాను. నా దగ్గర మంటలు కనిపించాయి. వెంటనే డ్రైవర్‌కు చెప్పాను. బస్సు ఆపి కిటికీలు పగలగొట్టి బయటపడటానికి ప్రయత్నించాం. సుమారు 20 మంది తప్పించుకున్నారు. కానీ చాలా మందికి సాధ్యపడలేదు,’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు, వెనక అద్దాలతో పాటు కిటికీ అద్దాలను కూడా బద్దలు కొట్టుకుని కొందరు గాయాలతో బయటపడ్డారు. జాతీయ రహదారిపై వెళుతున్న ప్రయాణికులు కొందరు ఆగి సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు వారు వివరించారు.