Yanamala Ramakrishnudu : యనమలలో ఆశలు పెరుగుతున్నాయటగా.. అదే కారణమా?
సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిలో మళ్లీ ఆశలు పెరిగాయి
సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిలో మళ్లీ ఆశలు పెరిగాయి. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కడంతో తనకు కూడా పార్టీ హైకమాండ్ ఏదో ఒక పదవి ఖచ్చితంగా ఇస్తుందన్న నమ్మకం పెరిగిపోయిందట. అశోక్ గజపతిరాజు లాగానే తాను కూడా పార్టీలో సీనియర్ నేత కావడంతో పాటు క్లిష్ట సమయంలో చంద్రబాబు కు అండగా నిలబడటంతో తనకు ఖచ్చితంగా పదవి లభిస్తుందన్న భావనలో ఉన్నారు. అశోక్ గజపతి రాజు కుమార్తె ఆదితి గజపతి రాజుకు కూడా గత ఎన్నికల్లో విజయనగరం టిక్కెట్ ఇవ్వగా, యనమల కుమార్తె దివ్యకు తుని నియోజకవర్గం టిక్కెట్ ఇచ్చింది. తునిలో యనమల దివ్య గెలిచింది. సుదీర్ఘకాలం తర్వాత తుని నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది.
గుర్తిస్తారన్న నమ్మకం...
ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంతో తనకు పెద్దల సభకు పంపాలని యనమల రామకృష్ణుడు బలంగా కోరుకుంటున్నారు. పార్టీ కోసం ఇప్పటి వరకూ తాను చేసిన కృషి, పడిన శ్రమను హైకమాండ్ గుర్తించకపోతుందా? అని యనమల బలంగా నమ్ముతున్నారు. అందుకే ప్రస్తుతం యనమల రామకృష్ణుడు మౌనంగానే ఉంటున్నారు. అదే సమయంలో తుని నియోజకవర్గానికే పరిమితమయ్యారు. అలాగని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద విమర్శలు మానుకోలేదు. అంటే ఖచ్చితంగా చంద్రబాబు తనవైపు చూస్తారని యనమల గట్టిగా విశ్వసిస్తున్నారు. తనలాంటి సీనియర్ నేతలను, సామాజివర్గానికి చెందినవారిని పక్కన పెట్టే అవకాశం లేదని కూడా అంచనా వేస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ...
ఆయన వయసుతో పాటు కొన్ని ప్రత్యేక పరిస్థితులు టీడీపీ అధినాయకత్వం మంత్రిపదవికి దూరం పెట్టింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ యనమల రామకృష్ణుడు మంత్రి పదవిలో ఉంటారు. ఆయనకు తూర్పు గోదావరి జిల్లా నుంచి నియోజకవర్గం ఫిక్స్ అయినట్లేనని ఎవరైనా లెక్కలు వేసుకుంటారు. పైగా చంద్రబాబుకు యనమల అత్యంత సన్నిహితుడిగా ముద్రపడింది. అనేక కష్ట సమయాల్లో పార్టీకి అండగా నిలిచారన్న పేరు కూడా పార్టీలో యనమల రామకృష్ణుడికి ఉంది. సీనియర్ నేత అయినా ఆయన సేవలను ఉపయోగించుకుంటారని అందరూ భావించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యనమల రామకృష్ణుడుకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో అప్పుడే కొంత సందిగ్దత మొదలయింది.
ఏదో ఒక పదవికి...
గత వైసీపీ హయాంలో మూడు రాజధానుల ప్రతిపాదన పెట్టినప్పుడు యనమల రామకృష్ణుడు శాసనమండలిలో తన రాజకీయ చతురతను ఉపయోగించి బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకోగలిగారు. ఇలా ఎలా చూసినా యనమల రామకృష్ణుడికి పదవి గ్యారంటీ అన్న ప్రచారం ఊపందుకుంది. మరొక వైపు అశోక్ గజపతిరాజుకు కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన ఏడాది తర్వాత గోవా గవర్నర్ గా నియమించడంతో ఇక తనను కూడా ఇటు రాజ్యసభ కు కాని, అటు గవర్నర్ గా పంపుతారన్న నమ్మకం యనమల రామకృష్ణుడి వర్గంలో పెరిగిపోయింది. అందుకే ఇక యనమల రానున్న రోజుల్లో మరింత యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది భవిష్యత్ లో తేలనుంది.