Rain Alert : మరో మూడు రోజులు ఏపీలో భారీ వర్షం.. వాతావరణ శాఖ హై అలెర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో నలభై ఎనిమిది గంటల్లో అల్పపీడనంగా బలపడి తమిళనాడు తీరం వైపునకు కదిలే అవకాశముందని తెలిపింది. అలాగే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి మరో రెండు రోజుల్లో వాయుగుండగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఇది కూడా తమిళనాడు తీరంవైపు పయనిస్తుండటంతో ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపార.
ఈ ప్రాంతంలో వర్షాలు...
అయితే వాయుగుండం ప్రభావంతో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, విజయనగరం, విశఆఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అప్రమత్తమం చేసింది. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని అందుకు తగినట్లుగా చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
మత్స్యకారులు చేపలవేటకు...
భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా ఉండటమే మేలని అధికారులు చెబుతున్నారు. అలాగే వాయుగుండం కావడంతో సముద్రంలో అలజడులు ఎక్కువగా ఉంటాయని, అలల ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అయితే మత్స్యకారుల చేపల వేటపై మాత్రం నిషిద్ధం ఇంకా అధికారులు ప్రకటించలేదు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచిస్తున్నారు. తమ ధాన్యాన్ని తడవకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో మూడు రోజుల పాటు బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.