పవన్ కళ్యాణ్ కు కాపు సంక్షేమ సేన సహకారం

Update: 2023-05-30 07:10 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాలనలో కాపులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కాపు నేత మాజీ ఎంపీ హరిరామజోగయ్య చెప్పారు. ఈ పరిస్థితుల నుంచి కాపులను రక్షించడానికి రానున్న ఎన్నికల్లో, రాష్ట్ర రాజకీయాల్లో కాపు సంక్షేమసేన ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం జరిగిన రాష్ట్ర కాపు సంక్షేమ సేన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రభుత్వం స్థాపించే దిశగా జనసేన అభ్యర్థులను గెలిపించడమే కాకుండా జనసేన కూటమిలో పోటీచేసే అభ్యర్థులు విజయానికి ముఖ్య భూమిక పోషిస్తామని చెప్పారు. అలా జరిగితే కాపులకు రాజ్యాధికారం దక్కుతుందన్నారు. జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కు కాపు సంక్షేమ సేన పూర్తి సహకారం అందిస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయడం ద్వారా కాపులకే కాకుండా బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి దోహదపడుతుందని అన్నారు.

జగన్ ను గద్దె దింపాలంటే పవన్ కళ్యాణ్ ను సీఎం చేసేందుకు చంద్రబాబు ముందుకు రాక తప్పదని కొద్దిరోజుల కిందట హరిరామజోగయ్య చెప్పారు. చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని.. లోకేష్ ను అధికారంలో భాగస్వామ్యం చేయాలని గతంలోనే ఆయన సూచించారు. రాష్ట్రంలో వైసీపీ ఎన్ని వ్యూహలు పన్నుతుందో టీడీపీ కూడా అదే తరహలో ప్రణాళికలతో ముందుకు వెళ్తుందన్నారు. జనసేనను బలహీనం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని.. కన్నా లక్ష్మీనారాయణ, మహాసేన రాజేష్ లాంటి ప్రముఖులను జనసేనలో చేరకుండా టీడీపీలో చేర్పించుకున్న విషయం వాస్తవం కాదా అని ఇంతకు ముందు ఆయన ప్రశ్నించారు.


Tags:    

Similar News