అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లు అదిరిపోతున్నాయ్ గా.. వచ్చే వారి కోసం?
అమరావతి పునర్‌నిర్మాణ పనుల శంకుస్థాపనకు రాజధానికి వచ్చే వారి కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలను కల్పిస్తుంది
అమరావతి పునర్‌నిర్మాణ పనుల శంకుస్థాపనకు రాజధానికి వచ్చే వారి కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలను కల్పిస్తుంది. భోజనంతో పాటు అల్పాహారం, తాగేందుకుమంచినీరు, మజ్జిగ తో పాటు రవాణా వసతిని కల్పిస్తోంది. ఇందుకోసం ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులు, ఆర్టీసీ బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. రాజధాని చుట్టుపక్కల ఉన్న ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఎక్కువ మంది సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
ఒక్కొక్క బస్సులో...
ఒక్కొక్క బస్సులో నూట ఇరవై ఆహారపొట్లాలు, వంద వరకూ అరటిపండ్లు, 120 నీటిసీసాలు, 60 ఓఆర్ఎస్ ప్యాకెట్‌లు, 60 మజ్జిగ ప్యాకెట్లు ఉంటాయి. బస్సులు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సభకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. దారిలో అల్పాహారం, సభకు వచ్చే సమయానికి భోజనం చేసి ప్రాంగణంలోకి చేరుకుంటారు. సభ నుంచి ప్రజలు తిరిగి బస్సు వద్దకు వచ్చే సమయానికి రాత్రి డిన్నర్‌కు సంబంధించిన ఆహారం ఆయా బస్సుల వద్దకు చేర్చే బాధ్యత పౌరసరఫరాల శాఖ తీసుకుంది.కిచిడి, చట్నీతోపాటు ఒక ఆరెంజ్ పండు అందరికీ అందిస్తారు. తిరుగు ప్రయాణంలో దారిలోనే డిన్నర్ ముగించుకుని ఇంటికి చేరుకుంటారు.
ఇంటికి తిరిగి చేరే వరకూ...
ఎండలు ఎక్కువగా ఉండటంతో రాజధాని శంకుస్థాపనకు వచ్చిన వారు ఇబ్బందులు పడకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మార్గమధ్యంలో ఉన్న ఆరోగ్యకేంద్రాలు, ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. సభాప్రాంగణంలో ప్రతి గ్యాలరీలోనూ ఆరుగురితో కూడిన వైద్య బృందం ఉంటుంది. ఎవరైనా అస్వస్థతకు గురైతే ఎక్కడికి తరలించాలో గ్యాలరీ ఇన్ ఛార్జి అధికారి సమన్వయం చేసు కోవాల్సి ఉంటుంది. వచ్చిన వారు తిరిగి తమ ఇళ్లకు సురక్షితంగా చేరుకునేలా దగ్గరుండి ఇన్ ఛార్జులు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.