Gorantla Madhav : గోరంట్ల ఆశలు ఇక గల్లంతయినట్లేనా?
మాజీ పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ కు ఈసారి కూడా వైసీపీలో టిక్కెట్ దొరకడం కష్టమే
మాజీ పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ కు ఈసారి కూడా వైసీపీలో టిక్కెట్ దొరకడం కష్టమే. ఆయన అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ వంటి నామినేటెడ్ పోస్టు ఇస్తారేమో కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మాత్రం ఇక దొరకదన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఆయన వరసగా అనేక వివాదాలలో కూరుకున్నందున, పార్టీకి ఇబ్బందికరంగా మారినందున ఆయనకు ఎక్కడా అసెంబ్లీ, పార్లమెంటు టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని తెలిసింది. గోరంట్ల మాధవ్ కు కూడా ఇటీవల కాలంలో చూచాయగా ఈ విషయాన్ని పార్టీ నాయకత్వం చెప్పినట్లు పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది.
వివాదాల్లో చిక్కుకుని...
పోలీస్ శాఖలో సర్కిల్ ఇన్స్ పెక్టర్ గా, పోలీస్ అధికారుల సంఘం నేతగా ఉండి, ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ హిందూపురంలో బీసీలకు టిక్కెట్ ఇవ్వాలనుకుంటున్న జగన్ కు గోరంట్ల మంచి ఛాయిస్ గా కనిపించారు. దీంతో ఆయనకు ఈ ఎన్నికల్లో హిందూపురం పార్లమెంటు టిక్కెట్ దక్కింది. అన్నీ కలిసొచ్చి విజయం సాధించారు. గెలిచిన తర్వాత అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. పార్లమెంటు సభ్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నా వ్యక్తిగత విషయాలతో ఆయన ఇబ్బంది పడ్డారు. పార్టీని కూడా ఇబ్బందుల్లోకి నెట్టారు. సామాజికవర్గం కోటాలో తనకు సీటు దక్కుతుందని ఇన్నాళ్లు భావించిన గోరంట్ల మాధవ్ కు మాత్రం ఇక ఆశ నెరవేరనట్లేనని అనుకోవాలి.
ఇతర నియోజకవర్గాల్లో...
వైసీపీకి నమ్మకమైన నేతగా గోరంట్ల మాధవ్ ఉన్నప్పటికీ ఆయన పత్తికొండ, రాప్తాడు నియోజకవర్గాలపై కన్నేశారు. కానీ అక్కడ అప్పటికే వైసీపీకి చెందిన బలమైన నేతలున్న కారణంగా వచ్చే ఎన్నికల్లోనూ ఎక్కడా గోరంట్ల మాధవ్ కు సీటు దక్కే అవకాశాలు లేవు. తమ నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నారంటూ అక్కడి నేతలు గోరంట్ల మాధవ్ పై వైసీపీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో వైసీపీ కి చెందిన ముఖ్య నాయకుడు ద్వారా జగన్ గోరంట్లకు సమాచారం పంపారని, ఆ నియోజకవర్గాల్లో వేలు పెట్టవద్దని సూచించినట్లు తెలిసింది. వైసీపీ అధికారంలోకి వస్తే నామినేట్ పదవి మాత్రం ఖచ్చితంగా దక్కుతుంది. అందుకే గోరంట్ల మాధవ్ ఇటీవల కాలంలో సైలెంట్ గా ఉన్నారు.