Ganta Srinivasa Rao : గంటా తీసుకున్న నిర్ణయం కరెక్టేనా?
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు. ఆయన తన కుమారుడికి తన రాజకీయ వారసత్వాన్ని అప్పగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనేక పార్టీలు మారినా, అనేక నియోజకవర్గాలు మారినా గంటా శ్రీనివాసరావుకు ఎప్పుడూ ఎదురుదెబ్బ తగలలేదు. కానీ ఈసారి మాత్రం ఆయన ఊహించిన విధంగా రాజకీయం సాగడం లేదు. తాను గెలిచి మంత్రిని కావాలనుకున్నప్పటికీ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. అంతేకాకుండా విశాఖ జిల్లా నుంచి వంగలపూడికి అనితకు ఇవ్వడంతో గంటా శ్రీనివాసరావుకు ఇక తాను రాజకీయాల్లో కొనసాగడం అనవసరమన్న భావన ఆయన అనుచరుల వద్ద వ్యక్తం చేస్తున్నట్లు కనపడుతుంది.
తిరిగి కూటమితోనే...
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వచ్చే ఎన్నికల్లోనూ పోటీకి దిగుతుంది. మరొకసారి అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ కాంబినేషన్ లో తనకు మంత్రి పదవి దక్కే అవకాశం లేదన్న నిర్ణయానికి గంటా శ్రీనివాసరావు వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే మొన్నటి ఎన్నికల్లోనే గంటా శ్రీనివాసరావుకు తొలి జాబితాలో టిక్కెట్ దక్కలేదు. చీపురుపల్లికి వెళ్లాలని కూడా నాయకత్వం సూచించింది. అయితే గంటా శ్రీనివాసరావు పట్టుబట్టి మరీ భీమిలీ సీటును తెచ్చుకున్నారు. గెలిచిన తర్వాత మాత్రం ఆయన సంతోషంగా లేరన్నది వాస్తవం. ఒక వైపు కాపులు ఎక్కువగా చంద్రబాబు మంత్రివర్గంలో ఉండటం, తన వియ్యంకుడు నారాయణ మంత్రిగా ఉండటంతో ఆయనకు కలసి రాలేదన్నది వాస్తవం.
వారసుడిగా...
దీంతో ఈసారి పోటీ చేసినా మంత్రి పదవి తనకు జిల్లా కోటాలోనూ, సామాజికవర్గం కోటాలోనూ తనకు మంత్రి పదవి దక్కదని ఆయన అంచనా వేసుకుంటున్నారు. ఇక పార్టీలు మారి కూడా ప్రయోజనం లేదని, అందుకే కూటమిలోనే తమ కుటుంబం ఉంటూ తన కుమారుడిని రాజకీయంగా అందిపుచ్చుకునేలా చేయాలని గంటా శ్రీనివాసరావు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అదీ గంటా శ్రీనివాసరావు తన కుమారుడిని భీమలి నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారని, ఇప్పటికే ఈ మేరకు పార్టీలోని ముఖ్య నేతలకు, తన ప్రధాన అనుచరులకు సంకేతాలు ఇచ్చారని అంటున్నారు. గంటా శ్రీనివాసరావు ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పి వ్యాపారాలను చూసుకోవడమో.. లేక విశ్రాంతి తీసుకోవడమో చేయాలని భావిస్తున్నారు