Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి బెయిల్ ఎప్పుడు వస్తుంది? ఇప్పట్లో వచ్చే అవకాశమే లేదా?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన గత నాలుగు రోజుల నుంచి విజయవాడ జిల్లా జైలులోనే ఉన్నారు. ఆయన బెయిల్ కోసం నేడు పిటీషన్ వేయనున్నారు. జిల్లా కోర్టులో వల్లభనేని వంశీ తరుపున ఆయన న్యాయవాదులు పిటీషన్ వేయనున్నారు. ప్రస్తుతం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీకి బెయిల్ పై బయటకు తీసుకు వచ్చేందుకు వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు తనకు జైల్లో మంచి ఆహారం, సదుపాయాలను కూడా కల్పించాలని కూడా నేడు జిల్లా కోర్టులో పిటీషన్ వేయనున్నారు. వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను విచారించిన తర్వాత కోర్టులో హాజరుపర్చగా పథ్నాలుగు రోజులు రిమాండ్ విధించారు.
కిడ్నాప్.. బెదిరించి...
వల్లభనేని వంశీని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఆ పార్టీ కార్యకర్త సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేసి.. బెదిరించారన్న ఆరోపణలున్నాయి. సత్యవర్థన్ తో కేసు వెనక్కి తీసుకునేలా వత్తిడి చేశారన్న అభియోగాలతో పోలీసులు వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. . ఈ ప్రయత్నాలు జరుగుతుండగానే విజయవాడ పోలీసులు, గన్నవరం పోలీసులు సహా పలు ప్రాంతాలకు చెందిన స్టేషన్లలో మరిన్ని కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గన్నవరం పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు సోషల్ మీడియాలో చంద్రబాబు, నారా లోకేష్‌లపై అసభ్య పదాలతో దూషించిన వీడియోపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఇలాంటి కేసుల్లో చాలా మంది వైసీపీ నాయకులు శిక్ష అనుభవిస్తున్నారు.
ఒక కేసులో బెయిల్ వచ్చి...
వల్లభనేని వంశీపై వరసగా కేసులు నమోదవుతుండటంతో ఒకదాంట్లో బెయిల్ వచ్చినా మరొక కేసులో జైలులో ఉంచేలా పకడ్బందీగా పోలీసులు ఉచ్చు బిగుస్తున్నారు. గతంలో నమోదైన కేసులతో పాటుగా తాజాగా మరికొన్ని కేసులు కూడా నమోదవుతున్నాయి. గన్నవరంలో ఇసుక దోపిడీపై ఇప్పటికే ఆయనపై రెండు కేసులు ఉన్నాయి. బెల్ట్‌షాపులను ప్రోత్సహించారన్న ఫిర్యాదులు కూడా గతంలోనే నమోదయిన నేపథ్యంలో గన్నవరంలో తమ ఆస్తులను వంశీ అనుచరులు లాక్కున్నారని.. వాటిని తిరిగి అప్పగించాలని.. తాజాగా టీడీపీ నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆ ప్రాంత బాధితులు ఫిర్యాదు చేసిన కేసులు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయి.
వరస కేసులు...
ఈ ఫిర్యాదులను వెంటనే టీడీపీ నాయకులు పోలీసులకు పంపారు. వాటిపై కేసు నమోదు చేయాలని కోరారు. వల్లభనేని వంశీపై లెక్కకు మిక్కిలిగానే కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే వంశీ ఒక కేసులో బయటకు వచ్చినా మరో కేసు వెంటనే ఆయనను లోపలకు తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తోంది. గతంలో టీడీపీ నేత, ప్రస్తుత ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఇలానే పన్నెండు కేసుల్లో రెండు నెలలకు పైగా జైల్లో ఉంచిన విషయాన్నిటీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. వల్లభనేని వంశీ బయటకు వచ్చే అవకాశం ఇప్పట్లో లేదన్నది అందరూ అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగానే కేసులు నమోదవుతున్నాయి.మరోవైపు పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటీషన్ పై నేడు కోర్టులో విచారణ జరగనుంది.