Vallabhaneni Vamsi : ఊహించిందే...రెడ్ బుక్ మొదటి పేజీలోనే వల్లభనేని వంశీ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇది పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు

Update: 2025-02-13 02:58 GMT

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇది పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉండగా ఆయన వ్యవహరించిన తీరుపై గుర్రుగా ఉన్న కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తుందని చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. టీడీపీ కార్యకర్తలు కూడా బలంగా అదే కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై వత్తిడి కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీని ఏ కేసులో అరెస్ట్ చేశారన్న దానిపై ఇంకా క్లారిటీ రాకపోయినప్పటికీ ఆయనపై కిడ్నాప్, బెదరింపులు వంటి కేసులు నమోదయినట్లు ప్రాధమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పోలీసులు దీనిపై వివరాలు తెలపాల్సి ఉంది.

టీడీపీ కార్యాలయంపై దాడి...
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారు. అయితే ఈ కేసులో హైకోర్టు నుంచి వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పొందారు. అంతే కాకుండా గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడిపై ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ను ఫిర్యాదు వెనక్కు తీసుకున్నారు. దీంతో వల్లభనేని వంశీని మరొక కేసులో అరెస్ట్ చేసినట్లు తెలిసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. అదే సమయంలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో నిందితులందరినీ వరసగా అరెస్ట్ చేస్తున్నారు. వారిలో చాలా మందికి బెయిల్ కూడా లభించింది.
కిడ్నాప్ కేసులో...
అయితే సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులోనే వల్లభనేని వంశీని రాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఆయనను అరెస్ట్ చేసిన సందర్భంగా తనకు ముందస్తు బెయిల్ ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారని పోలీసులతో వాదనకు కూడా దిగారు. అయితే ఆ కేసు కాదని చెప్పిన పోలీసులు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి విజయవాడకు వల్లభనేని వంశీని తరలిస్తున్నారు. విజయవాడ కోర్టులో వల్లభనేని వంశీని ప్రవేశపెట్టే అవకాశముంది. అయితే ఈ అరెస్ట్ తో గన్నవరంలో ఎలాంటి ఆందోళనలు నిర్వహించకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. వైసీపీ ఓటమి తర్వాత వల్లభనేని వంశీ ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు.


Tags:    

Similar News