TDP : టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇకలేరు
రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగావాసి పాలకొండ్రాయుడు మరణించారు
టీడీపీలో విషాదం నెలకొంది. రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగావాసి పాలకొండ్రాయుడు మరణించారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయసు డెబ్భయి ఎనిమిదేళ్లు. ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుగావాసి పాలకొండ్రాయుడు కన్నుమూశారు. 1978లో రాయచోటి నుంచి జనతా పార్టీ ఎమ్మెల్యేగా సుగావాసి పాలకొండ్రాయుడు విజయం సాధించారు.
టీడీపీ నేతగా..
1983లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా అక్కడి నుంచే బరిలోకి దిగి విజయం సాధించారు. 1984లో ఎన్నికల్లో రాజంపేట్ లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఇక 1999, 2004లోనూ సుగావాసి పాలకొండ్రాయుడు రాయచోటి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. సుగావాసి పాలకొండ్రాయుడు మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాలోకేశ్ లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి సంతాపాన్ని ప్రకటించారు.