NVSS Varma : పిఠాపురం వర్మ ఓపికతోనే ఎదురు చూపులు...ఆశలు నెరవేరేనా?
పిఠాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. వర్మకు ఇప్పట్లో పదవి దక్కే అవకాశం కనిపించడం లేదు.
పిఠాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. వర్మకు ఇప్పట్లో పదవి దక్కే అవకాశం కనిపించడం లేదు. పార్టీ ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ వర్మకు పదవి కట్టబెట్టే విషయంలో జనసేన ఆటంకంగా మారింది. పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో పాటు అక్కడ జనసేన, టీడీపీ వర్గాలకు మధ్య గ్యాప్ ఏర్పడటంతో వర్మకు పదవి ఇచ్చి అగ్నికి ఆజ్యం పోసినట్లు దానికి విభేదాలను మరింత ఎక్కువ చేసే ఆలోచనలో టీడీపీ అధినాయకత్వం లేదు. వర్మకు కీలకమైన ఎమ్మెల్సీ పదవి ఇస్తే పిఠాపురం నియోజకవర్గంలో రెండు గ్రూపులయిపోయి కూటమి మధ్య అగాధం ఏర్పడుతుందన్న అంచనాలు పార్టీలో బలంగా ఉన్నాయి.
త్యాగం చేసినందున...
అయినా ఎన్.వి.ఎస్.ఎస్. వర్మ ఓపికతోనే ఎదురు చూస్తున్నారు. పార్టీ అధినాయకత్వం తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని ఆయన భావిస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటంతో అది జనసేన ఖాతాలోకి వెళ్లిపోయింది. దీంతో గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తో చేతులు కలిపి ఎన్.వి.ఎస్.ఎస్. వర్మ నడిచారు. ఆయన విజయానికి తన వంతు కృషి చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన స్థానిక నేతలు, క్యాడర్ కు మధ్య మాత్రం గ్యాప్ ఏర్పడింది. ఎంతగా అంటే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు వర్మకు ఆహ్వానం అందడం లేదు.
నిరసనలు.. ఘర్షణలు...
దీంతో టీడీపీ కార్యకర్తలు ఆ కార్యక్రమానికి వెళ్లి నిరసనలు తెలియజేయడం పరిపాటిగా మారింది. ఒక్క పవన్ కల్యాణ్ పిఠాపురంలో పర్యటించినప్పుడు మాత్రమే ఎన్.వి.ఎస్.ఎస్. వర్మకు వేదికపైన చోటు దక్కుతుంది. మిగిలిన జనసేన నేతలు నిర్వహించే ఏ కార్యక్రమానికి వర్మ కు పిలుపు ఉండటం లేదు. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించన సందర్భంగా కూడా వర్మ అనుచరులు జనసేనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయన్నది చెప్పకనే చెప్పొచ్చు. ఒకరిపై ఒకరు దాడులకు కూడా దిగి హాట్ టాపిక్ గా మారారు. కానీ ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. కూటమిలోని పార్టీ కార్యకర్తల మధ్యే కొట్లాట జరుగుతున్న రెండు పార్టీల అగ్ర నాయకత్వం మాత్రం జోక్యం చేసుకోవడం లేదు.
తనపై జరుగుతున్న ప్రచారాన్ని...
అయితే ఎన్నికలకు ముందు తమ నేత ఎన్.వి.ఎస్.ఎస్. వర్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు పర్చాలని కోరుతున్నారు. ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. వర్మ కూడా తనకు చంద్రబాబు పిలిచి పదవి ఇస్తారని భావిస్తున్నారు. అందుకే ఇటీవల కాలంలో వైఎస్ జగన్ పైన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఒకదశలో ఆయన వైసీపీలో చేరతారన్న ప్రచారం జరిగినా అందులో వాస్తవం లేదని చెప్పడానికి వర్మ ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ వర్మకు పదవి ఇస్తే పిఠాపురం జనసేన క్యాడర్ మాట అటుంచితే .. పవన్ కల్యాణ్ హర్ట్ అవుతారేమోనని చంద్రబాబు ఇప్పట్లో వర్మకు పదవి దక్కడం అనుమానమేనని అంటున్నారు. కానీ వర్మ మాత్రం తన ప్రయత్నాలను మాత్రం ఇటీవల కాలంలో ముమ్మరం చేసినట్లు కనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.