Adimulapu Suresh : సురేష్ ఎక్కడైనా కనిపించారా? కనిపిస్తే కాస్త తాడేపల్లికి సమాచారం ఇవ్వమంటున్నారే

మాజీ మంత్రి వైసీపీ నేత ఆదిమూలపు సురేష్ పార్టీలో కనిపించడం మానేశారు

Update: 2025-07-12 07:59 GMT

వైసీపీ నేత ఆదిమూలపు సురేష్ ను ఎక్కడైనా చూశారా? కనిపించారా? ఏమయిపోయారు? పార్టీ అధికారం నుంచి వైదొలగిన తర్వాత ఈయన గారు ఎటు వెళ్లారో తెలియడం లేదు పార్టీకి కూడా అందుబాటులో లేకుండా పోయారు. వైసీపీ హయాంలో పూర్తి కాలం మంత్రిగా పనిచేసినా అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం కనిపించకుండా పోవడం క్యాడర్ లో కూడా ఒకింత అసహనం పెరిగిపోయింది. ఆదిమూలపు సురేష్ వరసగా మూడు నియోజకవర్గాల్లో పోటీ చేసి మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ఆదిమూలపు సురేష్ దక్షిణ మధ్య రైల్వేలో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేశారు. తర్వాత వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. 2009 లో కాంగ్రెస్ తరుపున యర్రగొండపాలెం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

మూడు సార్లు గెలిచినా...
అనంతరం ఆదిమూలపు సురేషన్ వైసీపీలో చేరి జగన్ వెంట నడిచారు. జగన్ 2014 ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ ను సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. అప్పడు అధికారంలోకి రాలేదు. 23 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లినప్పటికీ ఆదిమూలపు సురేష్ మాత్రం జగన్ చేతిని వదలలేదు. అదే సురేష్ కు బలంగా మారింది. 2019 ఎన్నికలకు వచ్చేసరికి సంతనూతలపాడు నుంచి ఆదిమూలపు సురేష్ ను మళ్లీ యర్రగొండపాలెంకు జగన్ షిఫ్ట్ చేశారు. సంతనూతలపాడులో గెలిచే అవకాశాలు లేవని సర్వే నివేదికలు రావడంతో ఆదిమూలపు సురేష్ ను తిరిగి యర్రగొండపాలెంకు పంపారు. అక్కడి నుంచి విజయం సాధించారు. జగన్ తొలి కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. రెండున్నరేళ్ల తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆదిమూలపు సురేష్ ను జగన్ కేబినెట్ లో కొనసాగించారు. అయితే ఈసారి విద్యాశాఖ కాకుండా మున్సిపల్ శాఖకు మార్చారు.
అధినాయకత్వం తలంటడంతో...
తన సొంత జిల్లా అయిన కడపకు ఆయనను ఇన్‌ఛార్జి మంత్రిగానూ జగన్ నియమించారు. అలా ఆదిమూలపు సురేష్ కు జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో పోటీ చేసిన కొండపి నియోజకరవ్గానికి ఆదిమూలపు సురేష్ ఇష్టం లేకుండానే వెళ్లారు. అక్కడ ఓటమి పాలు కావడంతో అక్కడ క్యాడర్ కు కూడా అందుబాటులో లేరు. ఇక 2024 ఎన్నికల్లో యర్రగొండపాలెం నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ వైసీపీ నుంచి గెలవడంతో అక్కడకు కూడా వెళ్లే పరిస్థితి లేదు. కానీ తనకు ఇష్టమైన యర్రగొండ పాలెంలో ఆదిమూలపు సురేష్ వేలు పెడుతుండటం, స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వర్గాన్ని తయారు చేయడంతో పార్టీ నాయకత్వం పిలిచి అక్షింతలు వేసిందట. ఈసారి సురేష్ ను మళ్లీ ఎక్కడకు షిఫ్ట్ చేస్తారో తెలియని పరిస్థితుల్లో ఆయన ఎటూ కాకుండా.. ఎవరికి కనపడకుండా హైదరాబాద్ కే పరిమితమయ్యారని తెలుస్తోంది.




Tags:    

Similar News