Ys Jagan : ఎలా మొదలయి.. ఎలా ముగుస్తుందో..? జగన్ నెల్లూరు పర్యటనపై ఉత్కంఠ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాల పర్యటన పోలీసులకు తలనొప్పిగా మారింది

Update: 2025-07-30 09:07 GMT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాల పర్యటన పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇటు అధికారంలో ఉన్న పార్టీ నుంచి వత్తిడి రావడంతో పర్యటనలపై ఆంక్షలు విధిస్తున్నారు. అయితే ఆంక్షలను వైసీపీ కార్యకర్తలు ఏ మాత్రం లెక్క చేయరనీ తెలుసు. ఎందుకంటే గతంలో గుంటూరు మిర్చియార్డు, తెనాలి, పొదిలి, రెంటపాళ్ల, చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం పర్యటనల్లో పోలీసులకు అర్థమయింది. పోలీసులు బ్యారికేడ్లు పెట్టినా ఎవరూ లెక్క చేయడం లేదు. దీంతో పోలీసులు అదనపు బలగాలను మొహరించారు. అయినా వైఎస్ జగన్ పర్యటనలో పార్టీ కార్యకర్తలను అడ్డుకోలేకపోతుండటంతో పర్యటన తర్వాత వరస కేసులు నమోదు చేస్తున్నారు. అయినా కేసులకు భయపడటం లేదు.

ఆంక్షలు విధించినా....
తాజాగా నెల్లూరు జిల్లా పర్యటన కూడా పోలీసులకు తలనొప్పిగా మారింది. జగన్ నెల్లూరు పర్యటనలపై ఆంక్షలు విధించారు. హెలిప్యాడ్ వద్దకు పది మందిని మాత్రమే అనుమతించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రన్నకుమార్ రెడ్డి ఇంటివద్దకు జగన్ తో పాటు పదిహేను మందికి మాత్రమే అనుమతిచ్చారు. తొలుత జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. జైలు వద్దకు జగన్ తో పాటు ముగ్గురిని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. అయితే జగన్ పర్యటన సందర్భంగా తాము వైసీపీ కార్యకర్తలను అదుపు చేయలేమని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉందని పోలీసులు చెబుతున్నారు. దీంతో జగన్ నెల్లూరు పర్యటన టెన్షన్ మధ్య కొనసాగే అవకాశముందంటున్నారు.
భారీగా పోలీసు బలగాలను...
జిల్లా నలుమూలల నుంచి పోలీసు బలగాలను నెల్లూరుకు దింపారు. జైలు పరిసర ప్రాంతాల్లోనూ, నల్లపురెడ్డి ప్రన్నకుమార్ రెడ్డి ఇంటి వద్ద పెద్దయెత్తున బలగాలను దించేందుకు సిద్ధమవుతున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కేసులు పెడతామని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడికి కూడా నోటీసులు జారీ చేశారు. కానీ వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశముండటంతో ఉద్రిక్తతల మధ్య జగన్ పర్యటన కొనసాగే అవకాశముంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే తాము ఆంక్షలు విధించామని పోలీసులు చెబుతున్నా, తమ నేత జిల్లా పర్యటనకు వస్తుంటే ఆంక్షలను విధించడమేంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద జగన్ పర్యటన ఎలా మొదలయి.. ఎలా ముగుస్తుందన్నది ఉత్కంఠగా మారింది.




Tags:    

Similar News