ఏబీవీ ఎందుకిలా మారిపోయారు...? ఆయన టార్గెట్ ఏంటి?

ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి తలనొప్పిగా తయారయ్యారు.

Update: 2025-07-28 08:01 GMT

ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి తలనొప్పిగా తయారయ్యారు. ఆయన అసంతృప్తికి గల కారణాలు తెలియడం లేదు కానీ, ఈ మధ్య కాలంలో టీడీపీ పాలనపైన విరుచుకుపడుతున్నారు. ఒకప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం చాలా వరకూ మారిపోయారు. ఏదో అసహనం ఆయనలో కనిపిస్తుంది. అది ఎంత వరకూ వెళ్లిందంటే తాను ఆశించిన రీతిలో పాలన సాగటం లేదన్న అభిప్రాయాన్ని ఏబీ వెంకటేశ్వరరావు తరచూ బాహాటంగా వ్యక్తం చేస్తుండటం అధికార పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. ఏబీ వెంకటేశ్వరరావు మిగిలిన వారిలా రాజకీయ పార్టీలు పెట్టకుండా జనంలో తిరుగుతూ ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

నామినేటెడ్ పోస్టు ఇచ్చినా...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న కేసులను ఎత్తివేసింది. అదే సమయంలో ఆయనకు ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నామినేటెడ్ పోస్టులో నియమించింది. కానీ ఏబీ వెంకటేశ్వరరావు ఆ పోస్టులో చేరేందుకు ఇష్టపడలేదు. అంటే ఏబీ తాను కోరుకున్న పోస్టు ఇది కాదని ఆయన భావించినట్లు టీడీపీ నేతలే అంటున్నారు. అయితే ఆయనకు మరో పదవి ఇవ్వాలంటే ఆయన సామాజికవర్గం కూడా ఇబ్బందికరంగా మారిందన్న కామెంట్స్ అధికార పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం సమయంలో తాను పడిన కష్టాలను ఓర్చి ఎదిరించినా టీడీపీ ప్రభుత్వం తనను గుర్తించలేదన్నభావన ఆయనలో గూడుకట్టుకున్నట్లుంది.
రాజకీయాల్లోకి వస్తున్నానంటూ...
అందుకే ఏబీ వెంకటేశ్వరరావు తాను రాజకీయాల్లోకి వస్తునట్లు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ ఎలాంటి పార్టీని ప్రకటించకపోయినప్పటికీ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఇటు వైసీపీని, అటు టీడీపీపైన విమర్శలు చేస్తున్నారు. వైసీపీపై విమర్శలు ఏబీ వెంకటేశ్వరరావు చేస్తే పెద్దగా ఆశ్చర్యం కలగదు. ఎందుకంటే వైసీపీ పాలనలో ఆయన ఎదుర్కొన్న కష్ట నష్టాలకు అలా రెస్పాండ్ అయ్యారని అనుకోవచ్చు. కానీ టీడీపీ అగ్రనేతలతో సత్సంబంధాలను నెరిపిన ఏబీ వెంకటేశ్వరరావు అదే పార్టీపైన, ప్రభుత్వంపైన విమర్శలు చేయడంపైనే సర్వత్రా చర్చ జరుగుతుంది. ఆయనలోని అసంతృప్తి, అసహనానికి గల కారణాలేంటన్న దానిపై తమకు కూడా అవగాహన లేదంటున్నారు టీడీపీ నేతలు.
తాజా వ్యాఖ్యలపై...
తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చ జరుగుతంది. జయప్రకాశ్ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ వంటి రాజకీయ నాయకులుగా మారినా ఇతర బ్యూరోక్రాట్ల నుండి తాను భిన్నంగా ఉన్నానని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. తెలుగుదేశం, వైసీపీ వంటి ప్రస్తుత పార్టీలతో అసంతృప్తిగా ఉన్న తన ప్రత్యేక భావజాలాన్ని మరియు ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాన్ని అందించాలనే కోరికను బలంగా చెప్పారు. ఏపీని అభివృద్ధి చేయాలంటే ఇలా సాధ్యం కాదన్న ఏబీ వెంకటేశ్వరరావు తాను ప్రజల్లోకి వెళ్లి వివరిస్తానని చెబుతున్నారు. మొత్తం మీద ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీకి విలన్ గా ఎందుకు మారారరన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగానే మిగిలిపోయింది.


Tags:    

Similar News