Nallari Kishore Kumar Reddy : నల్లారి కిషోర్ ఎక్కడ... అసలు పార్టీలో ఉన్నారా? లేదా?

పీలేరు టీడీపీ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎందుకో కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత పెద్దగా రాజకీయంగా యాక్టివ్ గా లేరు.

Update: 2025-08-19 07:57 GMT

పీలేరు టీడీపీ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎందుకో కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత పెద్దగా రాజకీయంగా యాక్టివ్ గా లేరు. ఆయన మంత్రి పదవిని గట్టిగా ఆశించారు. తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉన్నప్పుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరారు. తన సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ ఆయన మాత్రం టీడీపీలో చేరారు. నల్లారి కుటుంబానికి, నారా కుటుంబానికి మధ్య విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సుదీర్ఘకాలం శత్రుత్వం నడిచింది. నల్లారి కుటుంబం కాంగ్రెస్ లోనూ, చంద్రబాబు టీడీపీలోనూ ఉంటూ శత్రువులుగానే ఉన్నారు. కానీ జగన్ తమకు శత్రువైన పెద్దిరెడ్డి కుటుంబాన్ని చేరదీయడంతో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అనివార్యంగా టీడీపీలో చేరారన్నది వాస్తవం.

చేరిన వెంటనే నామినేటెడ్ పదవి...
టీడీపీలో చేరిన వెంటనే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అప్పట్లోనే నామినేటెడ్ పదవి ఇచ్చి గౌరవించారు. 2018లో పార్టీలో చేరిన తర్వాత నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పోస్టు ఇచ్చేశారు. దీంతో ఆయన కొంతకాలం పదవిలో ఉన్నారు. అయితే 2019 ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో పాటు పార్టీ కూడా అధికారంలోకి రాకపోవడంతో రాజకీయంగా మరొకసారి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే 2019 నుంచి 2024 వరకూ వైసీపీ ప్రభుత్వంలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిబాగానే యాక్టివ్ గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో పార్టీ జెండాను నిలబెట్టడానికి ఆయన బాగానే కృషిచేశారు. ప్రధానంగా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పోటీ చేస్తున్న మూడు నియోజకవర్గాల్లో బాగానే పనిచేశారు.
మంత్రి పదవి వస్తుందని...
2024 ఎన్నికల్లో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తొలిసారి పీలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తనకు మంత్రి పదవి లభిస్తుందని ఆయన అంచనాలు పెట్టుకున్నారు. సామాజికవర్గంతో పాటు తాను పార్టీకోసం నిలబడిన తీరు తనకు మంత్రి పదవి దక్కుతుందని గట్టిగా నమ్మారు. కానీ మంత్రి వర్గ కూర్పులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు కనపడుతుంది. తన కుటుంబం అన్నింటినీ పక్కన పెట్టి పార్టీలో చేరినా తనకు కేబినెట్ లో చోటు కల్పించకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఆయన గత ఏడాది నుంచి సైలెంట్ గానే ఉంటూ వస్తున్నారు. చిత్తూరు జిల్లా రాజకీయాల జోలికి కూడా పోవడం లేదు.
పీలేరుకే పరిమితమై...
కేవలం పీలేరుకు మాత్రమే పరిమితమయ్యారు. అంతేకాదు చిత్తూరు జిల్లాలో వైసీపీ చేస్తున్న ఆరోపణలపై కానీ, చిత్తూరు మామిడికి ధర చెల్లింపుపై బంగారుపాళ్యం పర్యటనకు జగన్ వచ్చినప్పుడు కానీ, టీటీడీపై వైసీపీ చేసే ఆరోపణలను ఖండించే విషయంలో కానీ నల్లారి వాయిస్ వినిపించడం లేదు. తనకెందుకు వచ్చిన గోలలేనని అని దూరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అసలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పార్టీలో ఉన్నారా? అన్న అనుమానం కూడా అనేక మందిలో కనిపిస్తుంది. ప్రభుత్వం నిచ్చిన కార్యక్రమాలను పీలేరులో నామ్ కే వాస్తేగానే చేస్తున్నారన్న టాక్ పార్టీలో వినిపిస్తుంది. నల్లారి మంత్రి పదవి రాలేదని అలిగారా? లేక ఆగ్రహమా? అన్నది మాత్రం త్వరలో తెలియనుంది. మరి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి భవిష్యత్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News