Samineni Uadaya Bhanu : అడ్డరోడ్డులో వెయిట్ చేయడం తప్ప మరో దారి లేదా?
కాంగ్రెస్ లోనూ, వైసీపీలోనూ ఒక వెలుగు వెలిగిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఇప్పుడు వెదికినా కనిపించడం లేదు
కాంగ్రెస్ లోనూ, వైసీపీలోనూ ఒక వెలుగు వెలిగిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఇప్పుడు వెదికినా కనిపించడం లేదు. రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో? లేక తనకు ఇక పొలిటికల్ గా కష్టమని భావిస్తున్నారో తెలియదు కానీ దూరంగా ఉన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గం అంటే సామినేని ఉదయభాను అందరికీ గుర్తుకు వస్తారు. కృష్ణా జిల్లాలో కాపు సామాజికవర్గం నేతగా ఎంతో పాపులర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి భాను లో ఉన్న ఫైర్ ను చూసి టిక్కెట్ వచ్చేలా చేశారు. దీంతో ఆయన జగ్గయ్య పేట ఎమ్మెల్యే అయి కూర్చున్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్, వైసీపీలో ఒకసారి ఓడినా, మరొకసారి గెలుస్తూ తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
జగన్ ను నమ్ముకున్నా...
అయితే 2019లో గెలిచిన తర్వాత మంత్రి పదవి వస్తుందని ఆశించినా సామినేని ఉదయభాను కు జగన్ కేబినెట్ లో స్థానం దక్కలేదు. రెండుదఫాలుగా కూడా జగన్ ఆయన పక్కన పెట్టారు. తాను నమ్ముకుని వైసీపీలో ఉంటే కనీసం జగన్ తనను పట్టించుకోకపోవడంపై సామినేని ఉదయభాను కొంత రగిలిపోతూనే ఉన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత సామినేని ఉదయభానులో కొంత ఆలోచన బయలుదేరింది. వైసీపీలో ఉంటే తనకు పొలిటికల్ కెరీర్ ఉండదని భావించి జనసేన పార్టీని ఎంచుకున్నారు. జనసేనపార్టీలో చేరినప్పటికీ సామినేని ఉదయ భాను అక్కడ ఇమడ లేకపోతున్నారు. ఎందుకంటే 2024లో జగ్గయ్యపేట నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా శ్రీరాం తాతయ్య గెలుపొందారు.
జనసేనలో ఉన్నప్పటికీ...
శ్రీరాం తాతయ్య తన పార్టీకి సంబంధించిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకాదు వైసీపీ నుంచి వచ్చి జనసేనలో చేరిన వారిని కూడా పక్కన పెడుతున్నారు.2004లో జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి గెలిచిన సామినేని ఉదయ భాను 2009, 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2019 లో గెలిచినా ఫలితం లేకుండా పోయింది. ఏ పదవులు లేకుండానే ఐదేళ్లు గడిచిపోయాయి. ఇక జనసేనలో చేరిన తర్వాత కూడా సామినేని ఉదయ భాను సంతృప్తికరంగా లేరని తెలుస్తుంది. పార్టీలో చేరిన రోజు తప్పించి తర్వాత జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చిన సంఘటనలు కూడా అరుదు అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి కాదని జనసేనకు కూడా టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదన్నది సామినేని ఉదయ భానుకు అర్థమయిందంటున్నారు.
వైసీపీలోకి వెళ్లినా...
తనకు ఇక మళ్లీ వైసీపీకి వెళ్లడమే మంచిదన్న సూచనలు కార్యకర్తలు, నేతలు నుంచి అందుతున్నాయి. దీంతో ససామినేని ఉదయ భాను పునరాలోచనలో పడ్డారని చెబుతున్నారు. అయితే ఒకసారి పార్టీని వీడి వచ్చిన తర్వాత తిరిగి చేరడంపై ఆయన ఆలోచనలు సాగుతున్నాయట. ఒకవేళ తిరిగి వైసీపీలోకి వెళ్లినా గతంలో మాదిరిగా ప్రాధాన్యత లభిస్తుందన్న గ్యారంటీ లేదు. అలాగని జనసేనలో ఉంటే పూర్తిగా పొలిటికల్ కెరీర్ క్లోజ్ చేసుకున్నట్లే అవుతుంది. అందుకే ఇప్పుడు సామినేని ఉదయ భాను అడ్డరోడ్డులో అదను కోసం వేచి ఉండటం తప్ప వేరే దారిలేదంటున్నారు. మొత్తం మీద ఒక సీనియర్ నేత పార్టీ మారినా ఫలితం లేకపోవడంతో రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారు.