YSRCP : డయేరియా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే
డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో వైసీపీకి చెందిన మాజీ మంత్రులు పర్యటించారు
డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో వైసీపీకి చెందిన మాజీ మంత్రులు పర్యటించారు. డయేరియా వ్యాప్తితో అతలాకుతలమైన శ్రీకాకుళంలోని దమ్మలవీధి, కాకి వీధి, గోల్కొండరేవు, బోడెమ్మ కోవెల, వాంబే కాలనీ, ఎల్‌బీఎస్ కాలనీల్లో మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు, డాక్టర్ సీదిరి అప్పలరాజు పర్యటించి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. డయేరియాతో కన్నుమూసిన వారి కుటుంబాలను పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రులు మీడియాతో మాట్లాడారు.
ప్రజారోగ్యం విషయంలో...
ప్రభుత్వ నిర్లక్ష్యంతో నగరంలో కలుషిత నీటి సరఫరా అవుతుందని తెలిపారు. ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తుందని అన్నారు. ఒకవైపు డయేరియాతో ప్రజలు చనిపోతున్నారని, మరోవైపు మీరు అమరావతిలో కబడ్డీ ఆడుతున్నారా? అని మాజీ మంత్రుల తీవ్ర ఆక్షేపణ తెలియజేశారు. డయేరియా మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలన్న మాజీ మంత్రులు వెంటనే స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని కోరారు.