జగన్ నెల్లూరు పర్యటనలో ఏం జరిగిందో తెలుసా?
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనలో ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నించిందని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.
kakani govarthan reddy
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనలో ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నించిందని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. ఆయన పర్యటన పట్ల ఉదారంగా వ్యవహరించామని హోంమంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. జగన్ నెల్లూరు జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు మాత్రమే వచ్చారని, జగన్ ను కలిసేందుకు వేలాది మంది వస్తారని తెలిసినా ఆయన పర్యటనకు సంబంధించి భద్రత ఏర్పాట్లను సక్రమంగా చేయలేదని కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు.
నామమాత్రపు భద్రత ఇచ్చారంటూ...
జగన్ పర్యటనకు నామమాత్రపు భద్రత ఇచ్చారని ఆయన అన్నారు. జగన్ నెల్లూరు జిల్లా జైలుకు చేరుకునే ఇరవై నిమిషాలు ముందు ములాఖత్ రద్దు చేశామని చెప్పారన్నారు. నామమాత్రపు భద్రత ఇవ్వడం వల్లనే జనాలు హెలిప్యాడ్ వద్దకు దూసుకు వచ్చారని ఆయన అన్నారు. పదకొండు చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలు జరిగితే కేవలం పిన్నెల్లి పైనే కేసు నమోదు చేశారన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇది రాజకీయ కక్ష కాదా? అని ప్రశ్నించారు.