తండ్రి సాక్షిగా... జగన్ వెంటే ఉంటా

రాజకీయాల్లో ఉన్నంత కాలం చివరి శ్వాస వరకు జగన్ వెంటే ఉంటానని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు

Update: 2023-05-18 12:50 GMT

రాజకీయాల్లో ఉన్నంత కాలం చివరి శ్వాస వరకు జగన్ వెంటే ఉంటానని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. జగన్ కోసమే తాను పని చేస్తానని తెలిపారు.జగనన్న నన్ను తరిమేసినా.. తిట్టినా.. నువ్వు ఈ పార్టీలో ఉండొద్దని చెప్పినా.. నా తండ్రి సాక్షిగా చెబుతున్నా... నేను జగన్ వెంటే ఉంటానని ఆయన భావోద్వేగానికి గురై చెప్పారు. వేరే గుమ్మం తొక్కే ప్రసక్తే లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి తమకు ఒక వ్యసనమని, ఆయన కోసం ఏమైనా చేస్తానని, తాను ఎమ్మెల్యే అయినా.. మంత్రి అయినా అది నాకు జగన్ పెట్టిన బిక్ష అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

ఆ ప్రకారమే...
తాను కొందరితో దూరంగా ఉంటున్నా..ఒక మనిషి పై మనకు మంచి అభిప్రాయం లేనప్పుడు దూరంగా ఉండటం మేలని, ఒక పెళ్లికి వెళ్లి అక్షింతలు వేసి తాళి ఎప్పుడు తెగుతుందా అని దీవించే కన్నా పెళ్లికి వెళ్లకపోవడమే మేలని భావించే వ్యక్తిని తాను అని తెలిపారు. పక్క పక్కన కూర్చుని వీడి ఎప్పుడు నాశనం అయిపోతాడా అని కోరుకునే బదులు దూరంగా ఉండడమే గౌరవంగా ఉంటుందన్న అనిల్ కుమార్ యాదవ్ దాని ప్రకారమే తాను నడుచుకుంటున్నానని తెలిపారు.
అన్నీ జగన్‌కు చెప్తా...
అందుకే కొందరితో విభేదాలు వస్తాయని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పేరున్న గొర్రె కన్నా ఒంటరిగా సింహం గా ఉండటం మేలని, సంవత్సరం పాటు తన గురించి కొందరు రకరకాలుగా మాట్లాడారని, సమయం వచ్చినప్పుడు అవన్నీ సీఎం జగన్ కు చెప్తానని అనిల్ అన్నారు. బాధ కలిగితే కచ్చితంగా సీఎం జగన్ చెప్పుకుంటానని, రాజకీయాల్లో తన భవిష్యత్తును ఆ భగవంతుడు, జగన్మోహన్ రెడ్డి, నెల్లూరు ప్రజలు నిర్ణయిస్తారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.


Tags:    

Similar News