Ambati : కూటమి సర్కార్ పై అంబటి ఫైర్.. డైవర్షన్ పాలిటిక్స్ అంటూ
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మొన్నటి వరకూ తిరుమల లడ్డూ వివాదం తెచ్చారని, తర్వాత ఇప్పుడు పీడీఎస్ బియ్యం కుంభకోణం అంటూ సిట్ వేశారని సెటైర్లు వేశారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈరకమైన ఎత్తుగడలకు చంద్రబాబు పాల్పడుతున్నారన్నారు. వాగ్దానాలు అమలు చేయకపోవడంతో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని, దానిని తొలగించేందుకు రోజుకొక రూపంలో ఏమార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
సిట్ వేసినా...
సిట్ వేసినా, ఇంకొకటి వేసినా ప్రయోజనం లేదన్నారు. అసలు దొంగలు ఎవరో తేల్చాలన్నారు అంబటి రాంబాబు, చంద్రబాబు బినామీ కేవీ రావు అంటూ ధ్వజమెత్తారు. చెప్పింది చేయడం చంద్రబాబుకు ఏనాడూ అలవాటు లేదని, అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా హామీలు ఇస్తారన్నారు. ఇప్పుడు దోపిడీకి పాల్పడుతూ గత ప్రభుత్వం అంటూ సాకులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. దొడ్డిదారిన కాకినాడ పోర్టును కేవీరావుకు కట్టబెట్టింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు అదే కేవీరావును పెట్టుకుని చంద్రబాబు డ్రామా ఆడుతున్నారని అన్నారు.