Ys Jagan : జగన్ అందరినీ దూరం చేసుకుని ఏం చేద్దామని?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు దగ్గర వాళ్లంతా దూరమవుతున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు దగ్గర వాళ్లంతా దూరమవుతున్నారు. నా అనే వాళ్లు ఎవరూ ఆయన వద్ద ఉండకుండా పోతున్నారు. అయిన వాళ్లే శత్రువులుగా మారుతున్నారు. జగన్ కు అధికార పక్షం కంటే ఇప్పుడు స్వపక్షమే పెద్ద ఇబ్బందిగా మారింది. అసలు ఎందుకీ పరిస్థితి? జగన్ లో లోపమా? లేక పక్కన ఉన్న వాళ్లు పక్కదోవ పట్టిస్తున్నారా? ఐఏఎస్ లు కావచ్చు.. సొంత మనుషులు కావచ్చు. ఎవరైనా చెప్పిన మాటలను విని తనను కష్టకాలంలో ఆదుకున్న వారిని దూరం చేసుకుంటే ఎవరికి నష్టమన్నది జగన్ ఆలోచిస్తున్నారా? లేదా? అని అనిపిస్తుంది. ఎందుకంటే 2019 ఎన్నికల తర్వాత నుంచే ఈ రకమైన పరిస్థితిని జగన్ ఎదుర్కొంటున్నారు.
చంద్రబాబును చూసైనా...?
సాధారణంగా రాజకీయ నేతలు కుటుంబ సభ్యులపై ఆధారపడతారు. అందరినీ కలుపుకుని వెళ్లాలని ప్రయత్నిస్తారు. వారికి పదవులు ఇచ్చో.. మరొక రూపంలోసాయం అందించో.. తనకు వ్యతిరేకంగా మారకుండా చేసుకుంటారు. చంద్రబాబు నాయుడును చూసైనా నేర్చుకోకపోతే ఎట్లా? ఎన్టీఆర్ ను దించేసి పార్టీని చేతుల్లోకి తీసుకున్నప్పటికీ నందమూరి కుటుంబాన్ని ఆయన దూరం చేసుకోలేదు. ఒక్క దగ్గుబాటి కుటుంబంతో మాత్రమే నిన్నటి వరకూ కొంత పొరపచ్చాలుండేవి. అవి కూడా మొన్నటితో మాసిపోయాయి. ఎన్టీఆర్ వారసులెవరు తన రాజకీయాలలకు అడ్డుపడకుండా వారిని చూసుకోగలిగారు. ఇక తన సొంత కుటుంబంలో కూడా చంద్రబాబు ఎప్పుడూ విభేదాలు పెట్టుకోలేదు. చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కొంతకాలం విభేదించినా తర్వాత మళ్లీ అన్న పంచన చేరిపోయారు.
తల్లి నుంచి చెల్లి దాకా...
కానీ జగన్ అధికారంలోకి రాగానే చెల్లి వైఎస్ షర్మిలను దూరం చేసుకున్నారు. తర్వాత తల్లికి దూరమయ్యారు. చివరకు చెల్లి, తల్లిపైన న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అధికారం కోల్పోయిన తర్వాత తన దగ్గర బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పార్టీని వీడి వెళ్లారు. జగన్ వైఖరి నచ్చకే ఆయన పార్టీని వదిలి తన ప్రత్యర్థి పంచన చేరారు. ఇక తాజాగా విజయసాయిరెడ్డి కూడా దూరమయ్యారు. విజయసాయిరెడ్డి బంధువు కాకపోయిన దగ్గర బంధువు కింద లెక్కే. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి ఆయన కుటుంబానికి ఆడిటర్ గా ఉన్న విజయసాయిరెడ్డి తర్వాత క్రమంగా రాజకీయాల్లోకి వచ్చారు.
సాయిరెడ్డి కూడా...
జగన్ వెంట జైలుకు వెళ్లారు. ఆయనకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత జగన్ పైనే ఉంది. విజయసాయిరెడ్డి ఏదైనా పొరపాటు చేసినా పిలిచి మందలించే స్వేచ్ఛ కూడా జగన్ కు ఉంది. కానీ ఆ రెండూ కాదని సాయిరెడ్డి తనంతట తానే దూరమయ్యేలా జగన్ చేసుకున్నారంటే జగన్ కు బంధువుల పొడగిట్టదన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. జనంలోకి కూడా ఈ ఘటనలు తప్పుడు ప్రచారానికి వెళతాయి. జనం కూడా అదినమ్మి జగన్ కు వ్యతిరేకమయ్యే అవకాశముంది. అదే సమయంలో దగ్గర బంధువులే దూరమయి ఆరోపణలు చేస్తుంటే చూసే వారికి నిజం అనిపించక మానదు. జగన్ ది స్వయంకృతాపరాధమేననిచెప్పాలి. ఇందులో ఎవరి తప్పిదం లేదు.