Jana Sena : జనసేన కు నేతల తాకిడి పెరుగుతుందా? చేరేందుకు లీడర్లు రెడీ అవుతున్నారా?
ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్నా జససేనలోకి చేరేందుకు ఇతర పార్టీల నేతలు సిద్దమవుతున్నారు
తెలుగుదేశం పార్టీ ఫుల్లు ప్యాకప్ అయింది. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాల స్థానంలో 225 నియోజకవర్గాలకు చేరుకుంటాయి. అంటే దాదాపు యాభై నియోజకవర్గాలు పెరుగుతాయి. కానీ తెలుగుదేశం పార్టీని చూస్తే హౌస్ ఫుల్ అయింది. సైకిల్ ఎక్కినా ప్రయోజనం లేదు. ఇప్పటికే ఓడిపోయి కొందరు.. టిక్కెట్ రాక మరికొందరు వచ్చే ఎన్నికల్లోనైనా నియోజకవర్గాల సంఖ్య పెరగడంతో తమకు టిక్కెట్ దక్కుతుందేమోనన్న ఆశతో ఉన్నారు. దీనికి తోడు తెలుగుదేశం పార్టీలో కొత్త తరం వచ్చేస్తుంది. అంతేకాకుండా అనేక సమీకరణాలను తీసుకుని చంద్రబాబు టిక్కెట్ ఇచ్చే వీలుంది. చివర వరకూ టిక్కెట్ దక్కడం కష్టమే.
సీనియర్ నేతలకు కూడా...
గత ఎన్నికల్లో సీనియర్ నేతలకు కూడా టిక్కెట్లు దక్కలేదు. దేవినేని ఉమ, జవహర్ లాంటి వాళ్లకే టిక్కెట్లు దక్కలేదు. ఇక్కడ కేవలం విధేయత మాత్రమే కారణం కాదన్నది తెలుగుదేశం పార్టీ నేతలకు అర్థమయింది. అక్కడ చివరి నిమిషంలో ఆర్థికంగా బలమైన వారు, ఎన్ఆర్ఐలు, సామాజికవర్గాల సమీకరణాలతో టిక్కెట్లు సొంతం చేసుకుంటారని గత ఎన్నికల సమయంలోనే స్పష్టమయింది. దీంతో జనసేన అయితే తమకు సేఫ్ ప్లేస్ అని చాలా మంది నమ్ముతున్నారట. ఎక్కువ మంది టీడీపీ, బీజేపీ నేతలు ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారట. వైసీపీ నేతలు ఎలాగూ చూస్తారు. కానీ కూటమి పార్టీలోని మిత్రపక్షాల నేతలే జనసేన వైపు చూస్తున్నారని సమాచారం.
అడ్వాంటేజీలు...
జనసేన పార్టీ అయితే రెండు అడ్వాంటేజీలున్నాయి. ఒకటి ఖచ్చితంగా తాము కోరుకున్న చోట టిక్కెట్ దక్కుతుంది. అక్కడ టీడీపీ నుంచి బలమైన నేత ఉన్నప్పటికీ పొత్తులో భాగంగా టిక్కెట్ పొందే వీలుందని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా సీట్లు దక్కకపోయిన తాము ఈసారి ఆ ఛాన్స్ మిస్ చేయదల్చుకోలేదు. అందుకే ఇప్పటికే కొందరు టీడీపీ నేతలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు టచ్ లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో చివరి నిమిషంలో టీడీపీ నుంచి వెళ్లి భీమవరం టిక్కెట్ సాధించుకున్న పులపర్తి రామాంజనేయులు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే అనపర్తి నియోజకవర్గం నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆ నియోజకవర్గం బీజేపీకి కేటాయిచండంతో అందులో చేరి ఎమ్మెల్యే అయిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
ఇప్పుడే చేరేందుకు...
అవనిగడ్డ నుంచి బుద్ధాప్రసాద్ కూడా చివరి నిమిషంలో టీడీపీ నుంచి జనసేనలో చేరి టిక్కెట్ తెచ్చుకున్నారు. అందుకే ఇప్పటి నుంచే జనసేన పార్టీలో చేరేందుకు కొందరు నేతలు సిద్ధమవుతున్నారని తెలిసింది. కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన ఇద్దరు కమ్మ సామాజికవర్గం నేతలతో పాటు రాయలసీమలోని రెడ్డి సామాజికవర్గం నేతలతో పాటు ఉత్తరాంధ్రకు చెందని టీడీపీ సీనియర్ నేతలు ఇద్దరు జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలిసింది. వీరంతా టీడీపీకి సంబందించిన సీనియర్ నేతలే కావడం విశేషం. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కుతుందో లేదో? తెలియక ముందే ఇప్పుడే చేరి ఆ నియోజకవర్గాన్ని ఫిక్స్ చేసుకుంటే మంచిదన్న ఆలోచనలో ఉన్నారు. మొత్తం మీద రానున్న కాలంలో జనసేన పార్టీలోకి నేతల తాకిడి పెరిగే అవకాశముంది. అయితే పవన్ కల్యాణ్ ఏ మేరకు వారి చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్నది చూడాల్సి ఉంది.