Pulivendula : గెలిచి వారేం చేస్తారు? ఓడి వీళ్లేం చేయనున్నారు? ఏడాది కాలానికి ఇంత సీనా?

పులివెందుల నియోజకవర్గంలో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచిన వారికి కూడా పెద్దగా ప్రయోజనం లేదు

Update: 2025-08-12 06:28 GMT

పులివెందుల నియోజకవర్గంలో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచిన వారికి కూడా పెద్దగా ప్రయోజనం లేదు. మరో పదినెలల్లోనో, ఏడాదిలోనో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు గెలిచిన వారు కూడా ఏడాదికి మించి పదవిలో ఉండలేరు. అదితెలిసినా పంతానికి పోయి రెండు పార్టీల నేతలు విజయం కోసం శ్రమిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఇలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకే రెండు పార్టీల నేతలు పంతాలను పక్కన పెట్టి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడగలగాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సమయంలో ఓటర్లను ఆపడానికిపోలీసు సిబ్బంది కూడా సరిపోరన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి.

మంత్రులు, ఎమ్మెల్యేలు...
ఒక జడ్పీటీసీ ఎన్నికకు మంత్రులు, ఎమ్మెల్యేలు మొహరించడంతో పాటు పోలీసుల చేత భయభ్రాంతులను చేయడం అవసరమా? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అలాగే టీడీపీ నేతలు మాత్రం తమ సంక్షేమ పథకాలను చూసి మహిళలు పెద్దయెత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారని, వారిని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతోనే ఘర్షణలు తలెత్తున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. వైసీపీ నేతలు పోలింగ్ శాతాన్ని తగ్గించడానికే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. కాని ఇరువర్గాల వాదనలో మాత్రం నిజం లేదనిపిస్తుంది. ఎందుకంటే ఓటర్లను పో్లింగ్ కేంద్రాలకు వెళ్లకుండా, ఓటు హక్కు వినియోగించుకోకుండా పోలీసులే అడ్డుకునే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కాళ్లు పట్టుకున్నా కనికరించని...
మరొకవైపు వైసీపీ నేతలు కూడా ముందస్తు అరెస్ట్ చేసినా మిగిలిన నేతలు మాత్రం టీడీపీకి అనుకూలంగా వస్తున్న ఓటర్లపై దాడులకు దిగుతున్నారన్న ఆరో్పణలు ఉన్నాయి. పోలీసుల వైఖరి మాత్రం కాస్తంత వివాదాస్పదంగానే మారింది. పోలీసులను కాళ్లుపట్టుకుని వేడుకున్నా అక్కడి ఓటర్లను అనుమతించడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ ఏజెంట్లను కూడా బయటకు లాగడంతో వన్ సైడ్ ఎన్నిక పులివెందులలో జరుగుతుందని విమర్శిస్తున్నారు. అయితే ఇందులో వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ఒకే తీరులో వ్యవహరిస్తుండటంతో భవిష్యత్ లో ఎవరు ఎవరిపై విమర్శలు చేసుకునే అవకాశంలేదన్న కామెంట్స్ సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. మొత్తం మీద పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో జరుగుతున్నాయి.


Tags:    

Similar News