Andhra Pradesh : నేటి నుంచి ఏపీ విద్యాశాఖ స్పెషల్ డ్రైవ్
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు సోమవారం నుంచి విద్యాశాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు సోమవారం నుంచి విద్యాశాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న వారిని ప్రభుత్వ బడుల్లో ఒకటో తరగతిలో చేర్పించడం, ఐదో తరగతి పూర్తయిన వారిని ఆపై తరగతిలో చేర్పించే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. విద్యా సంవత్సరం ముగింపునకు చేరినందున పైతరగతులకు వెళ్లే విద్యార్థుల ప్రవేశాలు పూర్తి చేయనున్నారు.
ఈ నెల 23వ తేదీ వరకు...
ఈ నెల 23వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. వేసవి సెలవులు పూర్తయి తిరిగి ప్రారంభమైన తర్వాత విద్యార్థులు ఎక్కువ మంది హాజరు అయ్యేలా ఇప్పటి నుంచే స్పెషల్ డ్రైవ్ ను అధికారులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటుగా పేద కుటుంబాలను చదువు వైపు మళ్లించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.