Andhra Pradesh : బాపట్ల వాసులకు తీపికబురు.. చీరాలకు వెళ్లి చీర్స్ కొట్టేయడమే ఇక
ఆంధ్రప్రదేశ్ కు మరో కొత్త జాతీయ రహదారి మంజూరవ్వడం పనులు వేగంగా జరగడం ప్రారంభమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ కు మరో కొత్త జాతీయ రహదారి మంజూరవ్వడం పనులు వేగంగా జరగడం ప్రారంభమయ్యాయి. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. జాతీయ రహదారి అంటే కనెక్టివిటీ పెరగడమే కాకుండా రాకపోకల్లో ఇబ్బందులు కూడా తగ్గుతాయని ప్రజలు భావిస్తున్నారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ రహదారి నిర్మాణ పనులను ప్రారంభించింది. వాడరేవు నుంచి పిడుగురాళ్ల ను కలుపుతూ నేషనల్ హైవే 167ఏ ను నిర్మిస్తున్నారు. బాపట్ల జిల్లాలో పనుల్ని వేగంగా చేపట్టారు. ఈరహదారి నిర్మాణంతో కోస్తాలోని కొన్ని జిల్లాల్లో పెనుమార్పులు సంభవించనున్నాయి. రూపురేఖలు మారుతున్నాయి.వాడరేవు- పిడుగురాళ్ల జాతీయ రహదారి పనులు పూర్తయితే ఎగుమతులు కూడా పెరుగుతాయి.
టూరిజం అభివృద్ధికి...
అదే సమయంలో టూరిజం అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. చీరాల ఓడరేవుకు ఎక్కువ మంది పర్యాటకులు వచ్చే అవకాశముంది. వీకెండ్ లో ఇతర రాష్ట్రాల నుంచి రహదారి మీదుగా వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముంది. ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ధరలు కూడా అమాతం పెరిగాయి. భూముల ధరలు ఈ జాతీయ రహదారి ఏర్పాటుతో రెట్టింపయ్యాయని చెబుతున్నారు. సహజంగానే ఇక్కడ భూముల ధరలు ఎక్కువ. ఇక ఇప్పుడు జాతీయ రహదారి ఏర్పాటు కానుండటంతో ఒక్కసారిగా ధరలు పెరిగాయి. ప్రధానంగా చీరాల, పర్చూరు ప్రాంత వాసులకు ఈ రహదారి నిర్మాణంతో అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. దీనివల్ల ఆదాయం కూడా పెరిగే అవకాశముంది.
చీరాల పరిశ్రమలకు
చీరాల కేవలం మత్స్య సంపదకు మాత్రమే కాకుండా వస్త్రాలకు కూడా ప్రసిద్ధి. మినీ ముంబయిగా పిలుస్తారు. చీరాలలో వస్త్ర దుకాణాలు పెద్దయెత్తున ఉన్నాయి. చేనేత కార్మికుల సంఖ్య కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు చీరాలకు వెళ్లి వస్త్రాలను తక్కువ ధరకు నాణ్యమైన వాటిని కొనుగోలుచేస్తుంటారు. ఇప్పుడు పట్టు చీరలు కావాలన్నా కంచి వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇకపై జాతీయ రహదారి ఏర్పాటయితే చీరాలలో వస్త్ర పరిశ్రమకు కూడా ఊతమిచ్చినట్లవుతుందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. చేపలు, రొయ్యల ఎగుమతులు కూడా సులువుగా మారుతుంది. జాతీయ రహదారి నిర్మాణాలకు సమీపంలో ఉన్న గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. హైవే అధికారుల పర్యవేక్షణలో ఈ పనులు కొనసాగుతున్నాయి.