Andhra Pradesh : జగన్ హయాంలో ఇళ్లు పొందారా? అయితే మీకు ఇబ్బందులే

వైసీపీ ప్రభుత్వ హయాంలో పక్కా ఇళ్లను పొందిన వారిలో అనర్హులను ఏరివేత కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించింది

Update: 2025-02-12 04:06 GMT

వైసీపీ ప్రభుత్వ హయాంలో పక్కా ఇళ్లను పొందిన వారిలో అనర్హులను ఏరివేత కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించింది. ఇళ్ల స్థలాల పొందిన లబ్ధిదారుల జాబితాపై పునర్విచారణ చేయాలని నిర్ణయించింది. రెవెన్యూ ఉద్యోగులతో విచారణ కమిటీని ఇందుకోసం నియమించింది. ఈ నెల 15 కల్లా ప్రభుత్వానికి నివేదిక అందివ్వాలని ఆదేశాలను జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఎక్కువ మంది అనర్హులు పక్కా ఇళ్లను పొందారన్న ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తమ పార్టీకిచెందిన వారితో పాటు ఆదాయాలతో సంబంధం లేకుండా కొందరికి పక్కా ఇళ్లను మంజూరు చేశారన్న ఆరోపణలు బలంగా రావడంతో విచారణ చేపట్టింది.

వరసగా ఏరివేత...
ఇప్పటికే పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని భావించిన ప్రభుత్వం దాని ఏరివేతను ప్రారంభించింది. ప్రతి నెలా పింఛను దారుల సంఖ్య తగ్గుతుంది. అదే సమయంలో సంక్షేమ పథకాలను అమలు చేసే ముందు గత ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలతో పాటు, లబ్దిదారుల జాబితాను కూడా పరిశీలించి అనర్హులను ఏరివేయాలని నిర్ణయించింది. రేషన్ కార్డుల జారీలో కూడా అనర్హులకు కేటాయించిందని భావించడంతో దాని ఏరివేత కూడా కూటమి ప్రభుత్వం చేపట్టింది. సంక్షేమ పథకాలను అర్హులైన వారికి మాత్రమే అందచేయాలని నిర్ణయించింది. ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా చూసేలా అర్హులకు మాత్రమే పథకాలను అందేలా చూడాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
వైసీపీ హయాంలో...
వైసీపీ హయాంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా పేదలకు మంజూరు చేసిన ఇళ్ల పట్టాలు, హౌసింగ్ నిర్మాణాలకు అనుమతులు పొందిన లబ్ధిదారుల్లో అర్హులు, అనర్హులు విషయంలో లెక్కలు తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. పునర్విచారణ కోసం ఈ నెల 10వ తేదీ నుంచి రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారుల జాబితాలో అనర్హులుంటే వారిని గుర్తించాల్సి ఉంటుంది. సమాచారాన్ని నమోదు చేసేందుకు రెవెన్యూశాఖ ప్రత్యేక మొబైల్ యాప్ ను సిద్ధం చేసింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్ లైన్ అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. పునర్విచారణ ప్రక్రియను ఆయా మండలాల్లో స్థానిక తహశీల్దార్ నేతృత్వంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయరు, విఆర్వో సభ్యులుగా ఉంటారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసి ఈ నెల 15వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని 26 జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.


Tags:    

Similar News