దయచేసి మాకు పెళ్లిళ్లు చేయరూ.. ప్లీజ్

ప్రస్తుత జనరేషన్ లో యువకులకు పెళ్లి కావడం కష్టంగా మారింది.

Update: 2026-01-20 03:17 GMT

ప్రస్తుత జనరేషన్ లో యువకులకు పెళ్లి కావడం కష్టంగా మారింది. అమ్మాయిల సంఖ్య తక్కువ.. అబ్బాయిల సంఖ్య ఎక్కువ కావడంతో అనేక మంది పెళ్లిళ్లు కాకుండానే జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. మంచి జీతం, ఉద్యోగం ఉన్నవారిని మాత్రమే యువతులు తమ భాగస్వామిగా ఎంపిక చేసుకుంటుడటం కూడా అనేక మందికి పెళ్లిళ్లు కావడమే కష్టంగా మారింది. అయితే తాజాగా సంక్రాంతి పండగకు తమ ఊళ్లకు వచ్చిన వారి కోసం తమకు మంచి సంబంధం వెతికిపెట్టాలంటూ ఒక ఫ్లెక్సీ యువకుల ఫొటోలు, పేర్లతో వెలువడటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కలికిరి గ్రామంలో...
చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలికిరిపల్లి గ్రామంలో ఈసారి సంక్రాంతి సందడి ఓ రేంజ్‌లో ఉంది. పశువుల పండుగలో గిత్తల పరుగు కంటే, ఊరి యువకులు ఏర్పాటు చేసిన ఒక భారీ బ్యానర్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సంప్రదాయ శుభాకాంక్షలకు భిన్నంగా, గ్రామంలోని యువకులు తమ ఫోటోలన్నింటినీ ఒకే చోట చేర్చి.. "ముఖ్య గమనిక: స్టార్ యువకులకు వధువు కావలెను" అని పెద్ద అక్షరాలతో బ్యానర్ కట్టేశారు. దాదాపు 30 మందికి పైగా యువకుల ఫోటోలతో కూడిన ఈ "మెగా మ్యారేజ్ బ్యానర్" చూసి జనం నవ్వు ఆపుకోలేకపోయారు.
ఆస్తులు, హోదాలు చూసి...
గతంలో గిత్తలని అదుపు చేసే మొనగాళ్ల కోసం చూసేవారు, ఇప్పుడు పిల్లని ఇచ్చే దాతల కోసం యువకులు ఇలా ఫ్లెక్సీల సాక్షిగా అడుగుతున్నారు. ఈ సరదా బ్యానర్ వెనుక ఒక బలమైన సామాజిక సందేశం దాగి ఉందని ఊరి పెద్దలు చెబుతున్నారు. "మా కుర్రాళ్లంతా సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులే, వయసు కూడా మించిపోలేదు. కానీ పెళ్లిళ్ల దగ్గరకు వచ్చేసరికి అబ్బాయికి కారు ఉందా? విమానం ఉందా? రైలు ఉందా? అని అడుగుతున్నారు."కేవలం ఆస్తులు, హోదాలు చూసి పెళ్లిళ్లు చేయడం మానేయండి. మానవత్వాన్ని, మనిషి గుణాన్ని చూడండి" అని ఆయన ఆడపిల్లల తల్లిదండ్రులకు సూచించారు. పండుగ సందర్భంగా కట్టిన ఈ బ్యానర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.


Tags:    

Similar News