YSRCP : ధర్మవరం మళ్లీ హీటెక్కనుందా.. కేతిరెడ్డి ఇక ఢీ అంటే ఢీ
ధర్మవరం రాజకీయం మరింత వేడెక్కనుంది.
ధర్మవరం రాజకీయం మరింత వేడెక్కనుంది. త్వరలోనే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే మళ్లీ గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమాన్ని కేతిరెడ్డి మొదలుపెట్టనున్నారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత తిరిగి ధర్మవరంలో ఆయన తన పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై గతంలో అధికారలో ఉన్నప్పుడు కబ్జా ఆరోపణలు చేసినప్పటికీ వాటిని అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నిరూపించలేకపోయారని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అంటున్నారు. నిజానికి గత ఎన్నికల్లో తన ఓటమిని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తట్టుకోలేకపోయారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి అవసరాలు, సమస్యలను వెంటనే పరిష్కరించే తనను ఓడించారంటే తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానంటున్నారు.
పార్టీపైనా విమర్శలు...
అందుకే పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఒకానొక దశలో వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు చేయడానికి కూడా వెనుకాడలేదు. మద్యం విషయంలో తమ ప్రభుత్వం విఫలమయిందన్నారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు కూడా తమకు అవకాశం లేదని చెప్పారు. సీఎంవోలో ధనుంజయ్ రెడ్డి వ్యవహార శైలిపై కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నాడు ధ్వజమెత్తారు. తాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతానని, తాను వైసీపీలోనే కొనసాగుతానని తర్వాత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వివరణ ఇచ్చారు. జగన్ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను మర్చిపోవడం, వాలంటీర్లనే సర్వస్వంగా భావించడం ఈ దుస్థితికికారణమని కూడా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు.
మూడేళ్ల ముందే...
అలాంటి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తిరిగి యాక్టివ్ అవుతున్నారు. కేతిరెడ్డి ఒకసారి కాంగ్రెస్ నుంచి మరొక సారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. రెండు సార్లు ఓటమి పాలయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో ఓటమికి తాను కారణం కాదన్న ధోరణి ఆయనలో స్పష్టంగా ఇప్పటికీ కనిపిస్తుంది. తన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధితో పాటు ప్రజలతో తాను మమేకమైన తీరు ఓటమి అసాధ్యమన్న భావనలోనే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఉన్నారు. అందుకే మరొకసారి గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు మూడేళ్ల ముందే ధర్మవరంలో తిరిగి గెలుపొంది తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టాలన్న యోచనలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఉన్నట్లు కనపడుతుంది.