TDP : పిలిచి పదవి ఇస్తామన్నా వద్దంటున్నారా? దేవినేని ఆలోచనలు అవేనా?

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావును రాజ్యసభకు పంపడంపై పార్టీలో చర్చ జరుగుతుంది

Update: 2025-11-21 07:56 GMT

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావును రాజ్యసభకు పంపడంపై పార్టీలో చర్చ జరుగుతుంది. మరో ఆరు నెలలో రాజ్యసభ స్థానాలు ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అవుతున్నాయి. ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలను దక్కించుకుంటే ఆరేళ్ల పాటు పదవికి ఢోకా ఉండదు. అనేక మంది సీనియర్ నేతలు రాజ్యసభ రేసులో ఉన్నారు. అయితే దేవినేని ఉమామహేశ్వరరావుకు పెద్ద వయసు మించిపోలేదు. ఆయనను రాజ్యసభ కు పంపే కంటే ఎమ్మెల్సీ ఇవ్వడం మంచిదన్న అభిప్రాయం కూడా ఆయన అనుచరుల నుంచి వ్యక్తమవుతుంది. కానీ పార్టీ అగ్రనాయకత్వం ఆలోచనలు ఎలా ఉన్నాయన్న దానిపై ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు.

ప్రత్యక్ష్య రాజకీయాలకు...
రాజ్యసభ స్థానానికి వెళ్లారంటే ఇక ప్రత్యక్ష్య రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలకు కూడా దూరమయినట్లే భావించాల్సి ఉంటుంది. ప్రజలతో నేరుగా సంబంధం లేని పోస్టు కావడంతో దానిపై దేవినేని ఉమ లాంటి వ్యక్తులు అంతగా ఆసక్తి చూపరు. దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయమంతా టీడీపీలోనే కొనసాగుతుంది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999 లో ఆయన నందిగామ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2004లోనూ ఆయన నందిగామ నుంచి ఎన్నికయ్యారు. తర్వాత నందిగామ నియోజకవర్గం రిజర్వ్‌డ్ కావడంతో పార్టీ అధినాయకత్వం సూచన మేరకు మైలవరానికి షిఫ్ట్‌ అయ్యారు. 2009, 2014 ఎన్నికల్లో దేవినేని ఉమ మైలవరం నుంచి ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో మాత్రం తొలిసారి ఓటమి పాలయ్యారు.
హైకమాండ్ ఆలోచన...
దేవినేని ఉమ వ్యవహారంలో అధినాయకత్వం ఆలోచన ఎలా ఉందన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు. ఉమ ఇక్కడుంటే మళ్లీ కృష్ణా జిల్లా రాజకీయాల్లో గ్రూపు తగాదాలు ఎక్కువవుతాయన్న వాదనలను కూడా పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకునే అవకాశముంది. అదే సమయంలో దేవినేని ఉమను రాజ్యసభకు పంపాలంటే సామాజికవర్గం కూడా కొంత అడ్డంకి గా మారుతుంది. ఈ నేపథ్యంలో దేవినేని ఉమకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిఇక్కడే కొనసాగిస్తారా? లేక వచ్చే ఎన్నికల్లో నందిగామ జనరల్ నియోజకవర్గం అయితే అక్కడి నుంచి పోటీ చేయవచ్చని సర్ది చెబుతారా? అన్నది ఇంకా తేలలేదు. రాజ్యసభ పదవి మాత్రం తనకు వద్దంటే వద్దని మాత్రం దేవినేని ఉమ చెబుతున్నట్లు తెలిసింది. పదవి ఇస్తామని ఎవరూ చెప్పకపోయినా.. తనకు పిలిచి పదవి రాజ్యసభ ఇస్తామన్నావద్దని చెబుతానని దేవినేని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారట.


Tags:    

Similar News