Janasena : జనసైనికులకు గుడ్ న్యూస్.. మీ పేరు పవన్ డైరీలో ఉందంటే మాత్రం?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లోకి రావడమే సేవే మార్గంగా వచ్చారు.

Update: 2025-07-10 08:57 GMT

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రావడమే సేవే మార్గంగా వచ్చారు. నిజానికి పవన్ కల్యాణ్ కు డబ్బులకు కొదవలేదు. పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలన్నదీ లేదు. ఎందుకంటే ఆయనకు సినీ హీరోగానే పవర్ స్టార్ గా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. తక్కువ సినిమాలు చేసినా మెగా స్టార్ చిరంజీవికి మించిన అభిమానులను సంపాదించుకోగలిగారంటే ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తాను రాజకీయాల్లోకి వచ్చింది కేవలం ప్రజాసేవ కోసమేనని, ఇరవైఐదేళ్ల పాటు రాజకీయాలు చేయడానికే వచ్చానని పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు చెప్పారు.

ప్రజలకు సేవ చేయాలని...
అయితే 2014లో పోటీ చేయకుండా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక 2019 ఎన్నికల్లో బీఎస్పీ, కాంగ్రెస్, కమ్యునిస్టులతో కలసి పోటీ చేసి చేతులు కాల్చుకున్నారు. అప్పుడు కాని ఆంధ్రప్రదేశ్ ప్రజల నాటి అర్థం కాలేదు. ఏపీ ఎన్నికల్లో గెలవాలంటే .. జగన్ ను ఎదుర్కొనాలంటే బీజేపీ, టీడీపీతో కలసి నడవడమే బెటర్ అని భావించి మూడు పార్టీలనూ కలిపి కూటమిని అధికారంలోకి తేగలిగారు. సీనియర్ గా, అనుభవమున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటంతో పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను తీసుకున్నారు. తనకు ఇష్టమైన శాఖలను అడిగి మరీ తీసుకుని వాటి ద్వారా ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించి ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవడం లేదు.
వైసీపీకి అధికారంలోకి రానివ్వకూడదన్న...
తన ప్రత్యర్థి వైసీపీని తిరిగి అధికారంలోకి రానివ్వ కూడదన్న నిర్ణయంతో ప్రభుత్వంపై మాట పడనివ్వకుండా ప్రతి నిమిషం కాపాడుకుంటూ వస్తున్నారు. ఎవరికి ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే స్పందిస్తూ తానున్నానన్న భరోసా ఇవ్వడంలో పవన్ కల్యాణ్ ముందుంటున్నారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ ను నమ్మి ఎందరో రాజకీయాలు వచ్చారు. వారికి కూడా అవకాశాలు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గతంలో ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు అనేక మంది పార్టీలోకి వచ్చి ఆర్థికంగా నష్టపోయారు. ఆ సంగతి పవన్ కు తెలియంది కాదు. అందుకే గత ఎన్నికల్లో కష్టపడి పార్టీ కోసం పనిచేసి, శ్రమించిన వారిని గుర్తించి వారికి పదవులను ఇవ్వాలని కూడా పవన్ కల్యాణ్ డిసైడ్ అయ్యారు.
వారికే ప్రాధాన్యత...
గత ఎన్నికల్లో కూటమి ఏర్పాటుతో కొన్ని నియోజకవర్గాలను మాత్రమే ఎంపిక చేసుకుని అందులోనూ కొందరికి మాత్రమే అభ్యర్థులగా ఎంపిక చేశారు. కానీ ఏడాది కాలంలో నామినేటెడ్ పదవులు కూడా కొన్ని కారణాల వల్ల కొందరికి ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని కొంతకాలం పక్కనపెట్టి పాత వారికి, తొలి నుంచి జెండా పట్టుకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం జాబితాను సిద్ధం చేస్తున్నారని తెలిసింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ తెప్పించుకుని నేతల పేర్లు తన డెయిరీలో నోట్ చేసుకుంటున్నారని, వారికి భవిష్యత్ లో పదవులు దక్కే అవకాశముందని చెబుతున్నారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ ఇక పనిచేసిన నేతలకు పదవులు ఇవ్వాలన్న దానిపైనే కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.


Tags:    

Similar News