Pawan Kalyan : ఉత్తరాంధ్ర వరదలపై పవన్ సమీక్ష
ఉత్తరాంధ్ర జిల్లాల్లో నెలకొన్న వరదల దృష్ట్యా అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అప్రమత్తం చేశారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో నెలకొన్న వరదల దృష్ట్యా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రక్షిత మంచినీటి సరఫరా శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అప్రమత్తం చేశారు. వంశధార, నాగావళి నదులకు వచ్చిన వరదల మూలంగా ప్రభావితమయ్యే గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా, వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మంచినీరు కలుషితం కాకుండా చూసేందుకు రక్షిత మంచినీటి సరఫరా శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పని చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖల అధికారులతో ఉత్తరాంధ్ర జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించారు.
సురక్షిత ప్రాంతాలకు...
ఉత్తరాంధ్రలో తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, దెబ్బ తిన్న పంటలు, వరద గురించి అధికారులు వివరించారు. ఒడిశా నుంచి వరద ప్రవాహం అధికంగా ఉందని, దీంతో శ్రీకాకుళంలోని గొట్టా బ్యారేజీ, వంశధార ప్రాజెక్టులకు అనుకున్న మేర కంటే అధికంగా వరద నీరు వస్తోందని తెలిపారు. ప్రాజెక్టుల పరిధిలోని పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారిని, ముంపు గ్రామాలను ఇప్పటికే జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసిందని వివరించారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు, రక్షిత మంచినీటి శాఖ అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సంబంధిత శాఖలో సమన్వయం చేసుకొంటూ, సహాయక చర్యల్లో భాగస్తులు కావాలని ఉప ముఖ్యమంత్రివర్యులు దిశా నిర్దేశం చేశారు.