ఆంధ్రజ్యోతి పై పరువు నష్టం దావా !

శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, టిటిడి పరువుకు భంగం కలిగించేలా ఆంధ్రజ్యోతి పత్రిక 2019, డిసెంబర్‌ 1న ప్రచురించ..

Update: 2022-03-22 12:04 GMT

తిరుపతి : ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతిపై తిరుమల తిరుపతి దేవస్థానం దాఖలు చేసిన పరువునష్టం దావాపై.. మంగళవారం తిరుపతి నాల్గవ అదనపు జడ్జి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు టిటిడి తరపున న్యాయవాదిగా బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి హాజ‌ర‌వ్వగా.. ఆంధ్ర‌జ్యోతి త‌ర‌ఫు న్యాయ‌వాదిగా క్రాంతిచైత‌న్య హాజ‌ర‌య్యారు. ఇరువురు న్యాయవాదుల మధ్య వాదోపవాదాలు జరగ్గా.. ఇరు వర్గాలు పరస్పర నోటీసులు జారీ చేసుకున్నాయి. ఈ నోటీసులపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను జూన్ 21కి వాయిదా వేసింది కోర్టు.

కాగా.. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, టిటిడి పరువుకు భంగం కలిగించేలా ఆంధ్రజ్యోతి పత్రిక 2019, డిసెంబర్‌ 1న ప్రచురించిన కథనంపై ఆ ప‌త్రిక‌పై టీటీడీ రూ.100 కోట్ల‌కు ప‌రువు న‌ష్టం దావా వేసిన సంగ‌తి తెలిసిందే. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు కేసులో ప్రతివాదులుగా ఉన్న నలుగురు న్యాయ కార్య పద్ధతి పాటించకుండా ఉండేలా గత ఏడాది డిసెంబర్‌ 29న సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కోర్టు అనుమ‌తితో వెన‌క్కు తీసుకున్నారు. వెంటనే ఆ పిటిషన్ పై ఆంధ్రజ్యోతి తరఫు న్యాయవాదికి నోటీసు ఇచ్చి పిటిష‌న్‌ను తిరిగి జడ్జికి అంద‌జేశారు. అలాగే ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి టీటీడీ తరఫున 'అడ్వొకేట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 32' కింద ప్రత్యేక అనుమతితో వాదిస్తున్నారని, ఆ అనుమతిని రద్దు చేయాలని ఆంధ్రజ్యోతి తరఫు న్యాయవాది క్రాంతిచైతన్య కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇరువురి పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయడానికి జడ్జి కేసును జూన్‌ 21కి వాయిదా వేశారు.



Tags:    

Similar News