Andhra Pradesh : P4 పథకం అమలులో ఉపాధ్యాయుల భాగస్వామ్యం... సర్కారుకు కో"దండం"

పేదలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకు వచ్చిన P4 పథకం విషయలో తీసుకుంటున్న నిర్ణయాలు ఇరుకున పెడుతున్నాయి

Update: 2025-07-29 07:11 GMT

పేదలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకు వచ్చిన P4 పథకం విషయలో తీసుకుంటున్న నిర్ణయాలు ఇరుకున పెడుతున్నాయి. ముఖ్యంగా పేద కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ఉపాధ్యాయులు ముందుకు రావాలని కోరడంతో ఉపాధ్యాయ సంఘాలు గుర్రుమంటున్నాయి. ఈ మేరకు చీఫ్ సెక్రటరీకి లేఖ కూడా రాశాయి. జీతాలతో జీవనం సాగిస్తున్న తమను P4 పథకం లో భాగస్వామ్యులు కావాలని వత్తిడి చేయడమేంటని ప్రశ్నిస్తున్నాయి. ఈ ఆలోచనను విరమించుకోకుంటే ఉద్యమానికి సిద్ధమవుతాయని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. తాము సంపన్నులం కాదని, నెలవారీ జీతగాళ్లమని మర్చిపోతున్నారా? అని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్టు కావడంతో...
P4 పథకం చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్టు. సంపన్న కుటుంబాలు పేద కుటుంబాలను దత్తత తీసుకుంటే వారిని పేదరికం నుంచి బయట పడేవచ్చన్నది ఈ పథకంకాన్సెప్ట్. పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమై ప్రతి ఒక్కరూ పేదకుటుంబాలను దత్తత తీసుకోవాలని కోరారు. నిజానికి సంపన్నుల చేపడితే ఇది మంచి కార్యక్రమమే. గతంలో గ్రామాలను దత్తత తీసుకునే వారు. ఇప్పుడు పేదలను దత్తత తీసుకుంటున్నారు. పేద కుటుంబాల్లో చురుకైన విద్యార్థుల చదువుకు అండగా నిలబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆర్థికంగా భవిష్యత్ లో నిలదొక్కుకుంటుంది. పేదరికం నిర్మూలన పూర్తిగా జరగకపోయినప్పటికీ చాలా వరకూ ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.
మంత్రులు, ఎమ్మెల్యేలను వదిలేసి...
అయితే ప్రజాప్రతినిధులు, మంత్రులను వదిలేసి ఉపాధ్యాయుల మీద పడటంతోనే ఇప్పుడు రగడగా మారింది. మామూలుగా ఉపాధ్యాయుల జోలికి పోతే ఏ ప్రభుత్వానికైనా త్వరగా బద్నాం అవ్వడానికి సులువుగా మారుతుంది. టీచర్లతో పెట్టుకున్న ఏ సర్కారూ సజావుగా పాలన సాగించలేదన్న సామెత ఉంది. అలాగే ఇప్పుడు ఏకంగా ప్రజాప్రతినిధులు, మంత్రులను వదిలేసి వారిని దత్తత తీసుకోమని చెప్పకుండా ఉపాధ్యాయులపై రుద్దడంతో వారు అడ్డం తిరుగుతున్నారు. ఇది ప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో P4 పథకం అమలు చైర్మన్ తుర్లపాటి మాత్రం తాము బలవంతం ఏమీ చేయడం లేదని, అలాంటి ప్రతిపాదన ఏమీ లేదని చెప్పినప్పటికీ విద్యాశాఖ ఉన్నతాధికారులు వత్తిడి తెస్తుండటంతో టీచర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం P4 పథకం పై ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. కొందరు అత్యుత్సాహంతో అధికారుల ఇలా వ్యవహరిస్తున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News