TDP : తనా లేదు..మనా లేదు.. ఎవరైనా ఒకటే.. దగ్గుబాటి కంట్రోల్ కారా?

అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మారేటట్లు కనిపించడం లేదు

Update: 2026-01-19 06:50 GMT

అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మారేటట్లు కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ కూడా ఆయన పై చర్యలు తీసుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తనా లేదు..మనా లేదు.. ఎవరైనా ఒకటే..డబ్బులే.. వేధింపులే. ఇటువంటి ఎమ్మెల్యేను ఇప్పటి వరకూ తాము చూడలేదంటూ టీడీపీ సీనియర్ నేతలే వాపోతున్నారంటే అతిశయోక్తి కాదు. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వరసగా వివాదాల్లో కూరుకుపోతున్నారు. ఎంతగా అంటే ఇటు పార్టీతో పాటు అటు ప్రభుత్వానికి కూడా మచ్చతెచ్చేలా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలల్లోనే ఎన్నో వివాదాలు.. ఎన్నో వార్నింగ్ లు.. అయినా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ లో మార్పులేదు.

అందరితోనూ విభేదాలే...
గత ఎన్నికల్లోనే అనూహ్యంగా దగ్గుబాటి ప్రసాద్ కు టిక్కెట్ లభించింది. రాప్తాడుకు చెందిన దగ్గుబాటి ప్రసాద్ కు అనంతపురం అర్బన్ టీడీపీ టిక్కెట్ లభించిందిఎంపీపీగా ఉన్న ఆయనకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సహకారంతో టిక్కెట్ దక్కించుకున్నారని అంటారు. కానీ ఎమ్మెల్యే అయిన నాటి నుంచి నియోజకవర్గంలోని సొంత పార్టీలో మిత్రులకన్నా శ్రతువులు ఎక్కువయ్యారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో విభేదాలు మరింత ముదిరి వీధినపడ్డాయి. ఆ మధ్యం జూనియర్ ఎన్టీఆర్ సినిమా కూడా దీనికి తోడయింది. వార్ 2 సినిమా విడుదల సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషిస్తూ చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీతో పాటు ప్రభుత్వానికి తలనొప్పిగా తయారయింది. దీంతో అధినాయకత్వం అమరావతికి పిలిచి చీవాట్లు పెట్టింది.
తాజా వివాదాలతో...
తాజాగా ఆయన గన్ మెన్ ఎగ్జిబిషన్ నిర్వాహకులను బెదిరించి సస్పెండ్ అయ్యారు. దీంతో పాటు టీడీపీ మహిళ కార్యకర్త స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలు కూడా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పై ఉన్నాయి. ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మరొక విషయం ఏంటంటే మద్యం షాపుల యజమానుల నుంచి మామూళ్లను దండుకోవడం వ్యవహారం మరింత ముదిరినట్లయింది. తొలిసారి చంద్రబాబు ఇచ్చిన వార్నింగ్ లు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పై పనిచేయలేదనే అనిపిస్తుంది. తాజాగా కొందరు అనంతపురం అర్బన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిఫిర్యాదు చేశారు. అయినా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ లో మార్పు రావడం లేదు. దీంతో చంద్రబాబు, లోకేశ్ లు ఏదో ఒక కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ అనంతపురం నేతలు కోరుతున్నారు.


Tags:    

Similar News