మొంథా తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు పాటిస్తే సులువుగా తుపాను ప్రమాదం నుంచి బయటపడవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ ను తాకుతున్న మొంథా తుఫాను గాలి వేగం గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. అయితే మేఘ విస్ఫోటనం .. మెరుపు వరదలు సంభవించే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కృష్ణా , తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక ప్రాంతాలు మెరుపు వరదలు ఎదుర్కోనున్నాయి. అయితే మెరుపు వరదలు సంభవించినప్పుడు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అధికారులు సూచిస్తున్నారు. తక్కువ సమయం లో అతి భారీ వర్షం పడటం కారణంగా రోడ్లు డ్రైనేజీ కాలువలు నిండిపోయి అవి జనావాసాల మీదకు వచ్చే అవకాశముందని, అందుకోసం ముందు జాగ్రత్త చర్యలతో పాటు ప్రభుత్వం సూచించనట్లుగా పునరావాస కేంద్రాలకు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు.
ఈ ప్రాంతంలో కుండపోత వర్షం...
మెరుపు వరదలు మచిలీ పట్నం , నరసాపురం, భీమవరం, పాలకొల్లు , యానాం కాకినాడ లాంటి చోట్ల వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని, ఈ ప్రాంత ప్రజలు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈరోజు మధ్యాహ్నం నుంచి.. బుధవారం మధ్యాహ్నం వరకూ జాగ్రత్తగానే ఉండాలని సూచిస్తున్నారు. పల్లపు ప్రాంతాల్లో నదులు, వాగులకు దగ్గరగా ఉన్నవారు మంగళవారం రాత్రి .. మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. నదులకు వాగులకు వంకలు దగ్గరగా నివసిస్తున్న వారు ఆవులు, గేదెలు లాంటి పెంపుడు జంతువులను వీలైనంత వరకు ఎత్తు ఎక్కువ వున్న ప్రాంతాల్లోకి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఒక్కసారిగా నీటి ప్రవాహం వస్తే అప్పుడు.. తరలించడం సాధ్యపడదని, మూగ జీవాలు జలసమాధి అయిపోతాయని తెలిపారు.
గురువారానికి రిలీఫ్...
రోడ్లు కాలనీ లు నీట మునగడం వల్ల బయటకు పోవడం రావడం అంత సులువు కాదని, అందుకే రెండు రోజులకు సరిపడా పాలు , వాటర్ బాటిల్స్ నిల్వచేసుకోవాలని అధికారులు సూచించారు. కృష్ణా, గోదావరి లాంటి నదుల పక్కన ఉన్న జనావాసాల్లో వరద రావడాన్ని ఊహించవచ్చని, తెలంగాణ లో మెదక్, కామారెడ్డి, రామాయంపేట లాంటి చోట్ల .. కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ సహాయక బృందాలు వచ్చి కాపాడే వరకువేచి ఉండాలని చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లల్ని బయటకు పంపవద్దని, రోడ్లు నీట మునిగినప్పుడు మాన్ హోల్స్ లో పడిపోయే ప్రమాదం ఉందని తెలిపింది. ముఖ్యంగా ద్వి చక్ర వాహన దారులు జాగ్రత్త గా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. గురు, శుక్రవారాల నాటికి వర్షం పూర్తిగా ఆగిపోయి పొడి వాతావరణం వచ్చేస్తుంది .