Montha Cyclone : మరికొద్ది గంటలు పాటు టెన్షన్.. మొంథా ఎలా దెబ్బతీస్తుందో?

మొంథా తుపాను మరింత బలపడి ఆంధ్రప్రదేశ్ వైపునకు దూసుకు వస్తుంది. సముద్రం ఇప్పటికే అల్లకల్లోంగా మారింది

Update: 2025-10-28 04:07 GMT

మొంథా తుపాను మరింత బలపడి ఆంధ్రప్రదేశ్ వైపునకు దూసుకు వస్తుంది. సముద్రం ఇప్పటికే అల్లకల్లోంగా మారింది. విశాఖ తీరంలో బలమైన ఈదురుగాలతో పాటు భారీ వర్షం పడుతుంది. నైరుతి, ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలోని మొంథా తుపాను బలపడింది. ఈరోజు సాయంత్రానికి కానీ అర్ధరాత్రి కాని కాకినాడ వద్ద తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వరకూ రెడ్ అలెర్ట్ ప్రకటించారు. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదిలుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉదయానికి తీవ్రతుపానుగా బలపడటంతో ఈ ప్రభావం ఎంత మేర ఉంటుందోనని భావించిన అధికార యంత్రాంగం ముందుగానే అప్రమత్తమయింది. ఈరోజు సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం మరియు కాకినాడ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90-110 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయన్నారు.

అత్యంత భారీ వర్షాలు...
దీని ప్రభావంతో నేడు కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అకాశం ఉందన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఇంట్లోనే సురక్షితంగా ఉండాలన్నారు. మొంథా తుపాను 233 మండలాల్లోని 1419 గ్రామాలు ,44 మున్సిపాలిటీల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే 2194 పునరావాస సిద్ధం చేశారు. అవసరమైన చోట పునరావాస కేంద్రాలకు తరలించడానికి జిల్లాల యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. సంరక్షణ కోసం 3,465 మంది గర్భిణీలు,బాలింతలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో మంచినీరు, ఆహారాన్ని అందచేస్తున్నారు.
558 కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు...
స్టేట్ కంట్రోల్ రూమ్ ఒకటి, పందొమ్మిది జిల్లా కంట్రోల్ రూమ్ లు, రెవెన్యూ డివిజన్ లో 54 , మండల/గ్రామాల్లో 484 గ మొత్తంగా 558 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఎటువంటి సహయం కోసమైనా కంట్రోల్ రూమ్స్ ని 24/7 సంప్రదించవచ్చన్నారు. కమ్యూనికేషన్ సిస్టమ్ కోసం 16 శాటిలైట్ ఫోన్లు, 35 DMR సెట్లు, ఇతర పరికరాలు జిల్లాల్లో అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజలతో ఉందని భయాందోళనలకు గురికావొద్దని సూచించారు. సహయకచర్యలు కోసం 11 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందాలు జిల్లాల్లో ఉన్నాయని, మరికొన్ని బృందాలు హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కంట్రోల్ రూంను సంప్రదించాలని కోరారు.


Tags:    

Similar News