తుఫాన్ ఎఫెక్ట్ : రెండ్రోజుల్లో భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు.. తస్మాత్ జాగ్రత్త!
ప్రస్తుతం తుఫాను పయనిస్తున్న దిశను బట్టి ఇది బంగ్లాదేశ్ లోని మయన్మార్ వద్ద తీరం దాటనున్నట్లు తెలుస్తోంది. తుఫాను కారణంగా వర్షాలు
cyclone mocha updates
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారి, గురువారం (నేడు) ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది క్రమంగా బలపడుతూ రేపటికి అనగా మే 12వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలో అతితీవ్ర తుఫానుగా మారనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత తన దిశను మార్చుకుంటూ క్రమంగా బలహీన పడనున్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండవకపోవచ్చని తెలిపింది.
ప్రస్తుతం తుఫాను పయనిస్తున్న దిశను బట్టి ఇది బంగ్లాదేశ్ లోని మయన్మార్ వద్ద తీరం దాటనున్నట్లు తెలుస్తోంది. తుఫాను కారణంగా వర్షాలు తక్కువే ఉన్నాయి. కానీ.. అంతకుమించిన ఉక్కపోత ఉంటుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. రెండ్రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల కంటే మరింత గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైన వడగాల్పులు, 41-43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని అంచనా. అటు తెలంగాణలోనూ 40 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్రమైన వడగాల్పులు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.