Andhra Pradesh : నాలుగు రోజులు ఏపీకి వానలే
దిత్వా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది
బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 3వతేదీ వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలిపింది. వాతావరణశాఖ సమాచారం ప్రకారం, దక్షిణ–పశ్చిమ బంగాళాఖాతంలో, ఉత్తర శ్రీలంకకు సమీపంగా ఉన్నతుపాను గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదిలింది. ఉదయం 11.30 గంటలకు అదే పరిసరాల్లో కేంద్రంగా ఉందని పేర్కొంది.
రేపటి నుంచి...
ఈ ప్రభావంతో శనివారం తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. దక్షిణ కోస్తాంధ్రతో పాటు ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.