Ditva Cyclone : దిత్వాతో వానలు దంచేస్తాయట.. ముంపు ఇక్కడేనట
దిత్వా తుపాను బలహీనపడినప్పటికీ దాని ప్రభావం మూడు రోజులుంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది
దిత్వా తుపాను బలహీనపడినప్పటికీ దాని ప్రభావం మూడు రోజులుంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోనూ కొన్ని జిల్లాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దిత్వా తుపాను ప్రభావం ఎక్కువగా శ్రీలంక పై పడింది. మన దేశంలో దీని ప్రభావం తక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నప్పటికీ ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు పొంచి ఉందన్న అంచనాలతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. భారీ వర్షాలు పడే ప్రాంతాల్లో ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేసింది. తమిళనాడు లోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రైల్వేస్టేషన్ లోకి కూడా వరద నీరు ప్రవేశించింది.
ఏపీలో మూడు రోజుల పాటు వానలు...
ఇక ఆంధ్రప్రదేశ్ లో దిత్వా తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దిత్వా ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. దిత్వా తుపాను తీరం వెంట కదులుతూ బలహీన పడుతుందని, తీరం దాటదని అధికారుల తెలిపారు. అయినా కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణలో తేలికపాటి జల్లులు.. చలిగాలులు...
దిత్వా తుపాను వాయుగుండంగా మారినా ఆ ప్రభావంతో తెలంగాణలో వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రెండు రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి తేలికపాటి వానలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే దిత్వా తుపాను కారణంగా చలి తీవ్రత మళ్లీ పెరిగింది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగరంలోనూ చలి ఎక్కువగా ఉంది.