Ditva Cyclone : దిత్వా తుపాను ఎఫెక్ట్.. ఏపీలో రెండు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలెర్ట్
నేడు దిత్వా తుపాను ఎఫెక్ట్ తో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు
నేడు దిత్వా తుపాను ఎఫెక్ట్ తో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండంగా దిత్వా కొనసాగుతుంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా తీవ్రవాయుగుండం కదులుతుంది. ఈరోజు మధ్యాహ్నానం లోపు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అందుకే ఈరోజు పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం కోరింది.
భారీ నుంచి అతి భారీ వర్షాలు...
నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ నాలుగు జిల్లాల ప్రజలు నేడు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని తెలిపారు. ప్రయాణాలు కూడా నేడు వాయిదా వేసుకోవాలని సూచించారు. ఎవరూ బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఈ నాలుగు జిల్లాల్లో సిద్ధం చేశారు.
కోస్తాంధ్రలో నేడు...
మరొకవైపు నేడు కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణకోస్తా తీరం వెంబడి 40నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. ఈదురుగాలులు బలంగా వీస్తాయి కాబట్టి రైతులు, ప్రజలు హోర్డింగ్ లు, చెట్ల కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.